-డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ ఆదేశాలు జారీ
-విద్యార్థుల, ఉపాధ్యాయులు వేసవి తాపం నుండి జాగ్రత్తలు తీసుకోవాలి
-రోజుకు మూడు సార్లు వాటర్ బెల్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని పలు చోట్ల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో విద్యార్థులు డీహైడ్రేషన్ (నిర్జలీకరణ)కు గురికాకుండా పాఠశాలల్లో ‘వాటర్ బెల్’ కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ జిల్లా విద్యాశాఖాధికారులకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. రానున్న రెండు రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ (APSDMA) అందించిన సమాచారం మేరకు సూర్యతాపం నుంచి అందరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. పాఠశాల సమయంలో విద్యార్థుల్లో మానసిక, శారీరక ఆరోగ్యం కాపాడటంతో పాటు వారిలో హైడ్రేషన్‌ను ప్రోత్సహించడమే ‘వాటర్ బెల్’ కార్యక్రమం లక్ష్యమని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో రోజుకు మూడు సార్లు (ఉదయం 8:45, 10:05, 11:50 గంటలకు) వాటర్ బెల్ కచ్చితంగా మోగించాలని ఆదేశించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పకుండా నీరు తాగేలా ప్రధానోపాధ్యాయులకు సూచించాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశించారు.