– రాజకీయాన్ని వ్యాపారం చేసిన సంపన్నులకు బుద్ధి చెప్పాలి
– సీపీఐ పశ్చిమ అభ్యర్థి జి.కోటేశ్వరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ కష్టం వచ్చినా పిలిస్తే పలికే కమ్యూనిస్టులకు ఓటు వేసి గెలిపించాలని ఇండియా కూటమి బలపరిచిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావు కోరారు. 49,50 డివిజనల ప్రచార యాత్ర నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిత్యం పోరాటాలు సాగిస్తున్న తమకు ఓటు వేయాలని, తద్వారా చట్ట సభల్లో సమాన్యుల గొంతు వినిపించేందుకు ఈ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ‘నీతివంతమైన రాజకీయాలు నమ్ముకున్న ఇండియా కూటమి ఒకవైపు.. రాజకీయాలను అమ్ముకోవడం, రాజకీయాలను వ్యాపారం చేయడం.. వ్యాపారంతోటి అధికారం పొందాలనే సంపన్నులు మరోవైపు పోటీ పడుతున్నారు. ఈ తరుణంలో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి స్థానికంగా పిలిస్తే పలికే కమ్యూనిస్టులకు కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి’ అని జి.కోటేశ్వరరావు అన్నారు. తొలుత దివంగత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జి.కోటేశ్వరరావు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు, సీపీఎం కార్పొరేటర్ బోయ సత్య బాబు,మాజీ కార్పొరేటర్ గాదె ఆదిలక్ష్మి, నగరపార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు తాడి పైడయ్య,49,50 డివిజన్ల కార్యదర్శులు బోరా రామకృష్ణ, పార్టీ నగర, స్థానికనాయకులు తదితరులు పాల్గొన్నారు.