గుంటూరులో 367 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగం

-ఏసీ కాలేజీలో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం.. నేడు కూడా అవకాశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు నగరంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగుల్లో 367 మంది మంగళవారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి కల్పించిన పోస్టల్ బ్యాలెట్ సదుపాయాల వివరాలను వెల్లడించారు.

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ ఓటు హక్కును కోల్పోకుండా ఉండేందుకు అక్టోబర్ 27, 28 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గుంటూరులోని ఏసీ కాలేజీలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించినట్లు కమిషనర్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియను నిర్వహించేందుకు ప్రత్యేకంగా 350 మంది సిబ్బందిని కేటాయించడంతో పాటు, ఫెసిలిటేషన్ సెంటర్‌లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మంగళవారం నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్‌లో 367 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని వెల్లడించారు. అక్టోబర్ 28వ తేదీ బుధవారం కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. పోలింగ్ రోజున ఎన్నికల విధులకు కేటాయించబడిన ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు వచ్చే ఉద్యోగులు తమ ఓటరు గుర్తింపు కార్డు, ఎన్నికల విధుల కేటాయింపు ఉత్తర్వులను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఓటింగ్ ప్రక్రియలో పూర్తి గోప్యత పాటించేలా ప్రత్యేక కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే, ప్రక్రియను పర్యవేక్షించేందుకు వీడియోగ్రఫీ, ఉద్యోగులకు అవసరమైన సహాయం అందించేందుకు హెల్ప్ డెస్క్ సదుపాయాలను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

పత్రాల ధ్రువీకరణ కోసం గెజిటెడ్ అధికారులు కూడా ఫెసిలిటేషన్ సెంటర్‌లో అందుబాటులో ఉంటారని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రతి ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకుని, తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని కె. మయూర్ అశోక్ కోరారు.