స్ట్రాంగ్ రూమ్ లు, పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా స్ట్రాంగ్ రూమ్ లు, పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ మంగళవారం తనిఖీ చేశారు. గుంటూరు నగర పాలక సంస్థ ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంగా గుంటూరు ఆంధ్రా ముస్లిం కళాశాలను వినియోగిస్తుండగా, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా పరిషత్ ఎన్నికలకు సైతం విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు లతో కలిసి జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు. పంపిణీ కేంద్రం వద్ద సామాగ్రి పూర్తి స్థాయిలో ఉండాలని, ఏ సామాగ్రి లోటు ఉండరాదని ఆదేశించారు. ఫలహారం, మధ్యాహ్న భోజన ఏర్పాట్లను ఎన్నికల సిబ్బందికి చేయాలని అన్నారు. రూట్ ల వారిగా వాహనాలు సిద్ధంగా ఉండాలని, పిఓలు, ఏపిఓలు, సిబ్బంది హాజరు చూడాలని అన్నారు.

ఎన్నికల సామగ్రి స్వీకరణ (రిసెప్షన్) కేంద్రం వద్ద వాహనాల రాకపోకలపై స్పష్టత ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను ట్రాఫిక్ జామ్ సమస్య ఉండరాదన్నారు. ఎన్నికల సిబ్బంది వాహనం దిగి నేరుగా రిసెప్షన్ కౌంటర్ వద్ద ఎటువంటి ఆలస్యం లేకుండా సామాగ్రి అప్పగించాలని చెప్పారు. రిసెప్షన్ కౌంటర్ వద్ద తగినంత సిబ్బందిని నియమించాలని సూచించారు. సిబ్బందికి మంచి నాణ్యమైన ఆహారం అందించాలని అన్నారు. స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ ల వద్ద సిసి కెమెరా ఏర్పాటు పక్కాగా ఉండాలని సూచించారు. మీడియా కేంద్రం ఏర్పాటు చేయాలని అన్నారు. పంపిణీ కేంద్రం, రిసెప్షన్ కౌంటర్ వద్ద
ఎటువంటి అసౌకర్యం, ఆలస్యం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు సజావుగా జరుగుటకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, నగరపాలక సంస్థ కమిషనర్ పర్యవేక్షక ఇంజనీర్ వెంకటేశ్వర రావు, సి.పి.ఓ రాంబాబు, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కళ్యాణ చక్రవర్తి,
జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి జి.శ్రీనివాస్, విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ సి.హెచ్.రమేష్, డి.ఎస్.పి ఎస్. కాంతా రావు, వెంకటేశ్వర్లు, మెప్మా పిఓ సింహాచలం తదితరులు పాల్గొన్నారు.