-ప్రసార మాధ్యమాల్లో రాజకీయ పార్టీల ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రానున్న సార్వత్రిక ఎన్నికలు 2024 సందర్భంగా ప్రసార మాధ్యమాల్లో రాజకీయ పార్టీల ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు కలెక్టర్ గారు చైర్ పర్సన్ ఎంసిఎంసి హోదాలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రానున్న సార్వత్రిక ఎన్నికలు 2024 సందర్భంగా ప్రసార మాధ్యమాల్లో రాజకీయ పార్టీల ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని తెలిపారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి జిల్లా కలెక్టర్ వారి అధ్యక్షతన జిల్లా స్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి ఇవ్వడంతో పాటు, చెల్లింపు వార్తలను (పెయిడ్ న్యూస్) ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని, మీడియా ఉల్లంఘనలు కూడా గుర్తించి తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. రిజిస్టర్ కాబడిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలు గానీ వారి తరఫున ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులు ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రచార ప్రకటనలను ప్రసారం చేసేందుకు అనుమతి కోసం నిర్ణీత నమూనాలో మూడు రోజులు ముందుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రిజిస్టర్ కానటువంటి రాజకీయ పార్టీలు, ఇతర వ్యక్తులు వారి ప్రకటన ప్రసారం చేయుటకు ఏడు రోజులు ముందుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు అందిన రెండు రోజుల్లోగా జిల్లాస్థాయి ఎంసీఎంసీ కమిటీ సదరు ప్రచార అంశాలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి ఉన్నచో అనుమతి మంజూరు చేస్తుందన్నారు. వార్తాపత్రికల్లో పోలింగ్ రోజు, పోలింగ్ కు ముందు రోజు తప్పనిసరిగా ఎంసీఎంసీ నుండి అనుమతి పొందిన తరువాతనే ప్రకటన ప్రచురించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటి వరకు 258 ప్రతికూల వార్తలు పత్రికల్లో రాగా అందులో 251 వాటిపై చర్యలు తీసుకోవడం జరిగిందనీ, ఇప్పటి వరకు అందిన రాజకీయ పార్టీల ప్రకటనలకు, ప్రచార కంటెంట్ కు 19 వాటికి ముందస్తు అనుమతులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. టెలికాస్ట్ సర్టిఫికేట్ పొందిన తరువాత మాత్రమే టీవి/కేబుల్/రేడియో/ప్రచార వాహనాల్లో ప్రకటనలు ఇవ్వాల్సి వుంటుందని, టెలికాస్ట్ సర్టిఫికేట్ లేని ఎన్నికల ప్రకటనలు ఎవ్వరూ ప్రదర్శించరాదన్నారు. అనుమతి పొందిన ఆర్డర్ నంబర్ ను సంబంధిత ప్రకటనపై తప్పక సూచించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని అన్ని ప్రసార మాధ్యమాలు గమనించాలని సూచించారు. ప్రింట్, మీడియాలో ప్రచురింపబడిన, ఎలక్ట్రానిక్ మీడియా లో టెలిక్యాస్ట్ అయిన వార్తలను మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై, పెయిడ్ న్యూస్ పై నిరంతర నిఘా ఉండాలని సూచించారు.
ఈ సమావేశంలో ఎంసిఎంసి మెంబర్ సెక్రెటరీ బాల కొండయ్య, ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రాం మేనేజర్ సుధాకర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.