-అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా యేర్పాట్లు చేయండి
-జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 21 ఆదివారం నిర్వహించ నున్న యూపీఎస్సి పరీక్షలను లోటు పాట్లు లేకుండా పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సి ) ద్వారా నిర్వహించే పరీక్షల నిర్వహణపై శుక్రవారం కలెక్టరేట్లో వెన్యూ సూపర్వైజర్లు, లైజన్ కం ఇన్స్పెక్టింగ్ అధికారులతో కలెక్టర్ ఢిల్లీ రావు అధికారులతో సమావేశంనిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 21 ఆదివారం నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డిఏ), నేవల్ అకాడమీ (ఎన్ఏ), సిడీఎస్ (కంబైండ్ డిఫెన్స్ సర్వీస్)పరీక్షలను యూపీఎస్సి నిర్వహించనుందని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 1,872 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారని, ఇందుకు 5 (ఐదు) పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డిఏ), నావెల్ అకాడమీ (ఎన్ఏ) పరీక్షలు ఉదయం 10.00గం.ల నుంచి మధ్యాహ్నం 12.30గం.ల వరకు, మధ్యాహ్నం 2.00గం.ల నుంచి సాయంత్రం 04.30గం.ల వరకు ఉంటుందన్నారు. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సిడీఎస్) పరీక్షలు ఉదయం 09.00గం.ల నుంచి 11.00గం.ల వరకు, మధ్యాహ్నం 12.00గం.ల నుంచి మధ్యాహ్నం 02.00గం.ల వరకు, మధ్యాహ్నం 03.00గం.ల నుంచి సాయంత్రం 05.00గం.ల వరకు జరుగుతాయని తెలిపారు.పరీక్షల నిర్వహణ కోసం ఐదుగురు రూటు అధికారులతో పాటు ఐదుగురు లైజన్ అధికారులను నియమించినట్లు చెప్పారు. ఇప్పటికే పరీక్షా పత్రాలను స్ట్రాంగ్ రూములలో భద్రపరచడం జరిగిందని అన్నారు. సకాలంలో పరీక్షా పత్రాలు కేంద్రాలకు చేరుకునేలా రూటు అధికారులు చర్యలు తీసుకోవాలని, అలాగే పోలీస్, తపాలా, వైద్య ఆరోగ్యం, ఏపీఈపిడిసిఎల్, జీవిఎంసి తదితర శాఖలు వారికి అప్పగించిన విధులను తూ.చ పాటించాలని చెప్పారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీరు, విద్యుత్ అంతరాయం లేకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగరాదని, ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్ , లైజన్ అధికారులు, పోలీస్, తపాలా, వైద్య ఆరోగ్యం, ఏపీఈపిడిసిఎల్, జీవిఎంసి తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.