-నేషనల్ రియల్ ఎస్టేట్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు హరిబాబు
-నారెడ్కో సెంట్రల్ జోన్ అధ్యక్షునిగా సందీప్ మండవ, కార్యవర్గం బాధ్యతల స్వీకారం
-స్ధిరాస్తి రంగం అంటే సమాజానికి సంపద సృష్టించటమే : సందీప్ మండవ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రియల్ ఎస్టేట్ పరిశ్రమ, ప్రభుత్వానికి మధ్య వారధిగా నేషనల్ రియల్ ఎస్టేట్ కౌన్సిల్ వ్యవహరిస్తుందని (నారెడ్కో) ఆ సంస్ధ జాతీయ అధ్యక్షుడు జి. హరిబాబు అన్నారు. రియల్ ఎస్టేట్ పరిశ్రమ వృద్ధిని ప్రోత్సహించే వాతావరణాన్ని సృష్టించటమే ధ్యేయంగా ముందడుగు వేస్తున్నామన్నారు. జాతీయ స్ధిరాస్తి అభివృద్ది మండలి సెంట్రల్ జోన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడ వేదికగా నిర్వహించారు. మాలక్ష్మి గ్రూపు సిఇఓ సందీప్ మండవ అధ్యక్షునిగా 20 మందితో కూడిన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించింది. కేంద్ర ప్రభుత్వ గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వీయ నియంత్రణ కలిగిన సంస్ధగా స్దిరాస్తి రంగంలో నారెడ్కో సేవలు అందిస్తోంది. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ సలహా, సంప్రదింపు ప్రక్రియల ద్వారా పరిశ్రమ, ప్రభుత్వాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. స్ధిరాస్తి రంగంలోని సభ్యుల మధ్య సమన్వయం, సహకారంతో ఈ రంగాన్ని ప్రభావితం చేసే కీలక విధానాలు, సంస్కరణల రూపకల్పనలో నారెడ్కో క్రియాశీలక భూమిక పోషిస్తుందన్నారు. ప్రాంతీయంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగైనప్పుడే స్ధిరాస్తి రంగం వేగవంతమైన అడుగులు వేయగలుగుతుందన్నారు. విభిన్న రాష్ట్రాలలో స్ధిరాస్తి రంగం అకాశమే హద్దుగా ఎదుగుతుండగా, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్ధితులు నెలకొన్నాయన్నారు.
నారెడ్కో రాష్ట్ర అధ్యక్షుడు జి. చక్రధర్ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి అయా ప్రభుత్వాలతో మరింతగా సమన్వయం సాధించవలసి ఉందన్నారు. నారెడ్కో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారామయ్య మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ది సాధించాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలను సరళీకరించవలసి ఉందన్నారు. జాతీయ స్ధిరాస్తి అభివృద్ది మండలి సెంట్రల్ జోన్ నూతన అధ్యక్షునిగా భాధ్యతలు స్వీకరించిన మాలక్ష్మి గ్రూపు సిఇఓ సందీప్ మండవ మాట్లాడుతూ స్ధిరాస్తి రంగం బలోపేతానికి అవసరమైన అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. స్ధిరాస్తి రంగం అంటే సమాజానికి సంపద సృష్టించటమేనని, ప్రభుత్వాల దృక్పధం ఆతీరుగా మారేలా సమన్వయం చేస్తామని వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నేషనల్ రియల్ ఎస్టేట్ డవలప్ మెంట్ కౌన్పిల్ (నారెడ్కో) పురోగతికి ప్రయత్నిస్తామన్నారు. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే క్రమంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సందీప్ మండవ పేర్కోన్నారు.
నూతన కార్యవర్గంగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో కార్యనిర్వాహాక ఉపాధ్యక్షులుగా ఎం.రాంబాబు, శరత్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా సాదినేని వెంకట రమణ, కోశాధికారిగా పోట్ల వెంకట కృష్ణ ఉన్నారు. కార్యనిర్వాహాక కార్యదర్శిగా జి. హరిప్రసాద రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎం. గణేష్ కుమార్, సిహెచ్ వెంకటేశ్వర్లు, కార్యదర్శులుగా పి.రాజకుమార్, రత్న కుమార్, కార్యవర్గ సభ్యులుగా శ్రీనివాసరావు, శ్రీనివాస్ మెహర్, సురేష్, శ్రీనివాస్, కృష్ణ కిషోర్, వేణు మాధవ్, చైతన్య, విశ్వనాధ్, మల్లేశ్వరరావు, వివి రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో నారెడ్కో రాష్ట్ర కార్యదర్శి కిరణ్ పరుచూరి, ఎన్నికల అధికారి కోనేరు రాజ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నారెడ్కో సెంట్రల్ జోన్ గౌరవ ఛైర్మన్ గా గద్దె రాజలింగం వ్యవహరించనున్నారు.