జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో అర్న‌బ్ కంట్రోల్ రూమ్‌లు

– ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముంద‌స్తు చ‌ర్య‌లు
– ప్ర‌జ‌లు అధికారుల సూచ‌న‌లు పాటించి జాగ్ర‌త్త‌గా ఉండాలి
– జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
అర్నబ్ తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేప‌ట్టిన‌ట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. తుపాను పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో కమాండ్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. మంగ‌ళ‌వారం అర్నబ్ తుపాను ప్రభావంపై గౌర‌వ ముఖ్య‌మంత్రి నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌కు హాజ‌రైన అనంత‌రం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల‌తో మాట్లాడారు. జిల్లా క‌లెక్ట‌రేట్‌లో 91549 70454 నంబ‌రుతో కంట్రోల్ రూమ్ సేవలందిస్తున్న‌ట్లు తెలిపారు. అదే విధంగా విజ‌య‌వాడ డివిజ‌న్ (7569008425), తిరువూరు డివిజ‌న్ (08673-251235), నందిగామ డివిజ‌న్ (7893053534)లోనూ క‌మాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. మండ‌ల‌స్థాయిలోనూ ఏర్పాటు చేసిన క‌మాండ్ కంట్రోల్ రూమ్ నంబ‌ర్ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. తుపాను పరిస్థితులపై నిరంతరం నిఘా ఉంచుతూ, క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ చ‌ర్య‌లు తీసుకునేలా దిశానిర్దేశం చేశారు. వర్షాలు, గాలుల ప్రభావంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా క్షేత్ర‌స్థాయిలో చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని.. అయినా ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే సంబంధిత కమాండ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలన్నారు. జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ తక్షణ స్పందనకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.