-28 వార్డుల్లో ఎన్నికల ప్రచారం.. పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు: ఎంపీ
తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త:
తిరువూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థుల తరఫున విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) విస్తృత ప్రచారం నిర్వహించారు. ఒకే రోజు 28 వార్డుల్లో పర్యటిస్తూ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి పి. మాధవి, వార్డు కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ప్రజలను కలుసుకున్నారు. తొలుత బైపాస్ రోడ్డులోని వినాయక దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం బైపాస్ రోడ్డు, రేపూడి బజార్, మధిర రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. పలుచోట్ల స్థానికులు, మహిళలు ఆయనకు స్వాగతం పలికారు.
ప్రచారంలో భాగంగా ప్రజలు తాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్ల వంటి సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా జనసేనకు చెందిన పి. మాధవిని కూటమి ప్రకటించిందని, ఆమెతో పాటు కౌన్సిలర్ అభ్యర్థుల విజయానికి అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు. కూటమి ఐక్యతతో ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యమని అన్నారు.
తిరువూరు అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
తిరువూరు మున్సిపాలిటీని రాబోయే ఐదేళ్లలో అభివృద్ధి చెందిన పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఎంపీ తెలిపారు. జాతీయ రహదారిపై సెంట్రల్ లైటింగ్, డివైడర్ల ఏర్పాటు, 11 చెరువుల ఆధునీకరణ, డ్రైనేజీ సమస్యల పరిష్కారం, పార్కింగ్ సౌకర్యాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
రూ.220 కోట్లతో తిరువూరు మంచినీటి పథకానికి టెండర్లు పిలిచామని, కృష్ణా నది నుంచి నీటిని తీసుకువచ్చి ఏడాదిలోగా ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్యమని వెల్లడించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని సంక్రాంతి నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యుత్ స్తంభాలు, వేలాడే విద్యుత్ వైర్ల సమస్యల పరిష్కారం, స్మశానవాటికలు, అంగన్వాడీ భవనాల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
గ్రీన్ఫీల్డ్ హైవే ద్వారా తిరువూరుకు మెరుగైన రవాణా అనుసంధానం ఏర్పడే అవకాశాలున్నాయని, దీనిని పట్టణ అభివృద్ధికి ఉపయోగించుకుంటామని ఎంపీ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కూటమి అభ్యర్థులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
