-రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పత్రికలు, పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఎపియుడబ్ల్యూజె) ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శి, ప్రెస్ అకాడమీ ఉమ్మడి రాష్ట్ర గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు నిమ్మరాజు చలపతిరావు శనివారం మంత్రి సారథిని మర్యాదపూర్వకంగా కలిశారు. అభినందనలు తెలుపుతూ శాలువాకప్పి సత్కరించారు. ఈసందర్భంగా పత్రికలు, పాత్రికేయుల దీర్ఘకాల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పెద్ద, చిన్న పత్రికలనే వివక్ష చూపకుండా నిష్పాక్షికంగా ప్రభుత్వ ప్రకటనలిచ్చి ఉనికిని కాపాడాలని, ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పాత్రికేయులందరికీ అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వడంతో పాటు ప్రమాద బీమా సౌకర్యాన్ని పునరుద్ధరించాలని కోరారు. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో మాదిరిగా రిటైరయిన జర్నలిస్టులకు నెలకు 10వేల రూపాయల చొప్పున పెన్షన్ సదుపాయం కల్పించాలని కూడా మంత్రిని కోరారు. సి.రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీకి పూర్తిస్థాయి పాలకవర్గాన్ని నియమించాలని సూచించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ.. ఈ సమస్యలన్నింటిపై అందరితో చర్చించి, ముందుగా తాను ఆకళింపు చేసుకుంటానని చెప్పారు. తరువాత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు.
విశాలాంధ్ర బృందం భేటీ..
ఇదే సమయంలో విశాలాంధ్ర విజ్ఞాన సమితి కార్యదర్శి, శాసన మండలి మాజీ సభ్యుడు జల్లి విల్సన్, జనరల్ మేనేజర్ హరినాథరెడ్డి, పబ్లిషింగ్ హౌస్ మేనేజర్ మనోహర్ నాయుడు మంత్రిని కలిశారు. శాలువాతో సత్కరించి ఆయనను అభినందించారు. పత్రికా రంగానికి సంబంధించిన పలు సమస్యలను వీరు మంత్రి సారథి దృష్టికి తెచ్చారు.