-ప్రత్యేక హోదాపై సీఎం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి : సీపీఐ రామకృష్ణ
-ఏపీ ప్రయోజనాల కోసం ఐక్యపోరాటాలు చేద్దాం : సీపీఎం శ్రీనివాసరావు
-ప్రత్యేక హోదా సాధనపై రౌండ్‌టేబుల్ సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో కొత్త ఏర్పడిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా పని చేయాలని, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటంతో పాటు ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలును సాధించటం కూడా ప్రాధాన్యతా అంశాల్లో చేర్చాలని, హోదా సాధనకు ఇదే సరైన సమయం అని వక్తలు అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం స్థానిక బాలోత్సవ భవన్‌లో జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ పదేళ్లుగా బీజేపీ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని తెలుగు ప్రజలు మర్చిపోలేదని ఇప్పటికీ గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఎంపీలు బీజేపీ అభ్యర్థులపైనే గెలుపొందారని గుర్తు చేశారు. టీడీపీ ఎంపీలు లోక్‌సభలో, వైసీపీ ఎంపీలు రాజ్యసభలో కీలకంగా ఉన్నారని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామని కేంద్రం ప్రకటిస్తే వైసీపీకి 36 మంది ఎంపీలు ఉన్నప్పటికీ జగన్‌మోహన్‌రెడ్డి తన కేసులకు భయపడి ప్రధాన మంత్రికి వినతిపత్రం ఇవ్వలేకపోయారని విమర్శించారు. విశాఖ రైల్వే జోన్, రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటును సాధించుకోవాల్సి ఉందన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఎంపీలు ధైర్యంగా పార్లమెంట్‌లో మాట్లాడాలని డిమాండ్ చేశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని ఇది సజీవ సమస్యగా ఉందన్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలను కలిసి ఏపీకి ప్రత్యేక హోదా గురించి చర్చిస్తాం అన్నారు. వైసీపీ ఎంపీలు రాజ్యసభలో హోదాపై తీర్మానం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఐక్యంగా పోరాడాలని, దానికి ప్రతిపక్షం కూడా సానుకూలంగా స్పందించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ హోదా కోసం 2014 నుంచి పోరాటం జరుగుతుందని చంద్రబాబు, జగన్ ఇద్దరు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలని కోరారు. చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు చేపడితే జగన్‌కు చంద్రబాబు తేడా ఉండదన్నారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రత్యేక హోదా, విభజన హామీ సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో చంద్రబాబు, జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ప్రత్యేక హోదా, విభజన హామీలపై ఏకగ్రీవ తీర్మానాలు చేసి ఉన్నాయని వాటిని మరొకసారి కేంద్రానికి పంపించాలని కోరారు. ప్రత్యేక హోదాకు నిర్ణీత గడువు ఉండదని, ఈశాన్య రాష్ట్రాల్లో ఇంకా ప్రత్యేక హోదాతో వచ్చే రాయితీలు అమలు అవుతూనే ఉన్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టు రాతి, మట్టి కట్టడానికి ఏదో నిధులు సరిపెట్టి కేంద్రం మోసం చేయాలనే ప్రయత్నం చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. సాప్ట్‌వేర్ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రక్కన ఉన్న రాష్ట్రాల కంటే చాలా వెనుకబడి ఉందన్నారు. మీడియాపై అప్రకటిత నిషేధాన్ని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించం అన్నారు.
ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవాని మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ, వైసీపీలు ఏరుదాటిన తరువాత తెప్పతగలేసే పార్టీలని విమర్శించారు. హోదా సాధించగలం అనే రీతిలో ఢిల్లీ స్థాయిలో ఉద్యమాన్ని చేపట్టాలన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యు.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గతంలో చంద్రబాబు ప్రత్యేక హోదా సాధన కోసం ధర్మపోరాట దీక్షలు చేశారని, రాష్ట్రానికి రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని ధ్వజమెత్తిన పవన్‌కళ్యాణ్ ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్నారని వారికి ప్రత్యేక హోదా ఆవశ్యకత ఏమిటో తెలుసునన్నారు. స్కిల్ డెవలెప్‌మెంట్ చేసిన యువతకు ఉపాధి అవకాశాలు రావాలంటే పరిశ్రమలు రావాలని అది హోదాతో సాధ్యం అవుతుందన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాధ్, సాధన సమితి జిల్లా కన్వీనర్ దోనేపూడి శంకర్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యు.ఉమామహేశ్వరరావు, జై భారత్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, సీఐటీయూ నాయకులు కె.ఉమామహేశ్వరరావు, ఆంధ్రరాష్ట్ర ప్రజాసమితి నాయకులు జీఎస్.ఫణిరాజ్, ఏపీ చేతివృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ భాస్కరయ్య, తాటికొండ నరసింహారావు ప్రత్యేక హోదా సాధన ప్రాధాన్యతపై మాట్లాడారు.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివారెడ్డి, సీపీఎం రాష్ట్ర నాయకులు సీహెచ్.బాబూరావు, సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు కొట్టు రమణరావు, సీపీఎం నాయకులు రంగారెడ్డి, యువజన సంఘం నాయకుడు సూర్యారావులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.