– అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి
– సహాయక చర్యలు చేపట్టేందుకు సన్నద్ధత ముఖ్యం
– కలెక్టరేట్‌లో 0866-2575833 నంబరుతో కంట్రోల్ రూం
– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న 48 గంటల్లో జిల్లాలో భారీ వర్షాలుపడే అవకాశముందన్న వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌వోలు; అదేవిధంగా మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు; డివిజన్ స్థాయి అధికారులు.. ఇలా ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి, అప్రమత్తతతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన ఆదేశించారు.
శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వీసీకి హాజరైన అనంతరం కలెక్టర్ సృజన.. రెవెన్యూ, విద్యుత్, పౌర సరఫరాలు, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ తదితర శాఖల జిల్లా అధికారులతో పాటు ఆర్‌డీవోలు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలు మూలంగా తలెత్తే పరిణామాలను ముందస్తు ప్రణాళికతో సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఎటువంటి ప్రాణ, పశునష్టం, పంట నష్టం జరక్కుండా పటిష్టమైన చర్యలతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నవారికి పునరావాసం కల్పించాల్సి ఉంటుంది కాబట్టి ఇందుకు ముందుగానే తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అవసరమైన ఆహారం, మందులు వంటివాటిని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పునరావాస కేంద్రాల్లోఅవసరమైన బియ్యం, నూనె, పప్పు, కొవ్వొత్తులు వంటి వాటిని అందుబాటులో ఉంచాలన్నారు. వాగులు వంకలు పొంగిపొర్లేందుకు అవకాశమున్నందున ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ముఖ్యంగా నందిగామ ప్రాంతంపై దృష్టిసారించాలన్నారు. రహదారులు దెబ్బతిన్నా చక్కదిద్దేందుకు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు ముందుగానే అవసరమైన సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎక్కడైనా ఏదైనా సమస్య ఉత్పన్నమైతే ఏ సమయంలోనైనా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కలెక్టరేట్‌లో 0866-2575833 నంబరుతో కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని తెలిపారు.
విజయవాడ కొండ ప్రాంతాల్లోని ఆవాసాలపై దృష్టిసారించి.. ప్రమాదకర పరిస్థితిలో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చి, వారి బాగోగులు చూసుకోవాలన్నారు. కూలే ప్రమాదం ఉన్న ఇళ్లను గుర్తించి.. అందులో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలన్నారు. ఎక్కడైనా చెట్లు పడిపోతే వెంటనే తొలగించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరక్కుండా చూడాలని కలెక్టర్ సృజన
ఆదేశించారు. విధుల్లో ఎక్కడైనా అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. టెలీకాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్, డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, ఆర్‌డీవోలు బీహెచ్ భవానీ శంకర్, ఎ.రవీంద్రరావు, కె.మాధవి; విజయవాడ మునిసిపల్ కమిషనర్ ఎ.మహేష్ తదితరులు పాల్గొన్నారు.