విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో విజయవాడ నగరంలో వర్షపు నీటి నిల్వలు, పారిశుధ్య నిర్వహణ, ప్రమాదకర వృక్షాల కొమ్మల తొలగింపు, ప్రజలకు అందుతున్న సహాయక చర్యలను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యటనలో భాగంగా ప్రకాశం రోడ్, జమ్మి చెట్టు సెంటర్, సిద్ధార్థ స్కూల్ రోడ్, పినమనేని పాలీ క్లినిక్ రోడ్, నిర్మల స్కూల్ రోడ్, బందర్ రోడ్, మార్గ కృష్ణయ్య రోడ్, సింగ్‌నగర్ ప్రాంతాల్లో పర్యటించి తుఫాన్ ప్రభావంతో నగరంలో నెలకొన్న పరిస్థితులను సమీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారి ఆదేశాల మేరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత సిబ్బంది చేపడుతున్న చర్యలను పరిశీలించారు. ముఖ్యంగా చెట్ల కొమ్మల తొలగింపు, వర్షపు నీటి నిల్వల నివారణ, కాలువల్లో పూడిక తొలగింపు, నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చూడటం వంటి పనులను సమన్వయంతో చేపట్టాలని తెలిపారు. ప్రజలకు ఏవైనా అత్యవసర సహాయాలు అవసరమైనా వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, తుఫాన్ ప్రభావం తగ్గే వరకు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.
వర్షపు నీరు ఎక్కువగా నిలిచే ప్రాంతాలను పరిశీలించి, నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగిస్తున్న తీరును గమనించారు. రహదారులపై నిలిచిన వర్షపు నీటిని గల్ఫర్లు, ఆయిల్ మెషిన్ల సహాయంతో తొలగిస్తూ, నీరు సజావుగా ప్రవహించేలా అధికారులు చేపడుతున్న చర్యలను పరిశీలించారు. వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రధాన రహదారులతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే పనులను కూడా సమీక్షించారు. అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఇందులో భాగంగా సింగ్‌నగర్‌లోని కేరన్ షేర్ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని స్వయంగా సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. అప్పటికే కేంద్రంలో 43 మంది ఆశ్రయం పొందుతున్న నేపథ్యంలో వారికి ఉదయం అల్పాహారం అందించిన వివరాలను తెలుసుకున్నారు. ఆశ్రయం పొందుతున్న వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. నగరంలో అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు.
ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కె. ప్రభుదాస్ సిబ్బంది పాల్గొన్నారు.
