విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో విజయవాడలో ఓటు హక్కు కలిగి ఉండి, రెండవ సాధారణ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ రోజున ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకుని తమ ఓటు హక్కును వినియోగించుకునేలా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ఎన్నికల విధుల్లో నిమగ్నమైన సిబ్బంది సైతం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందులో భాగంగా మొగల్రాజపురంలోని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలోని ఇండోర్ స్టేడియంలో ధ్యాన్‌చంద్ బ్లాక్‌లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
విజయవాడలో ఓటు హక్కు కలిగి ఉండి, పోలింగ్ రోజున ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తమ ఎన్నికల విధులకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌తో పాటు ఓటర్ ఐడీ కార్డు లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డును తీసుకువెళ్లి అక్టోబర్ 29, 30 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని కమిషనర్ వివరించారు.
ఈ సమాచారాన్ని విజయవాడ నగరపాలక సంస్థలోని అన్ని శాఖాధిపతులు తమ పరిధిలోని సిబ్బందికి తెలియజేసి, అర్హులైన సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని కమిషనర్ ఆదేశించారు.
అంతేకాకుండా ఇతర ప్రభుత్వ సంస్థలలో పోలింగ్ రోజు ఎన్నికల విధులు పనిచేస్తున్న సిబ్బంది అనగా టీచర్లు కౌంటింగ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, తదితరులు ఎవరైనా సరే పోలింగ్ రోజున ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారు పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగించుకోవాల్సిందిగా కోరారు.
