విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో నగరంలో వర్షపు నీరు సజావుగా ప్రవహించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ సూర్య కుమార్ నాయక్ పర్యవేక్షణలో బుడమేరు కాలువలో ప్లాస్టిక్ వ్యర్థాలు, గుర్రపుడెక్క మొక్కలను తొలగించే పనులు చేపట్టారు. బుధవారం ఉదయం రాజరాజేశ్వరి పేట, నందమూరి నగర్ వద్ద ప్రవహించే బుడమేరు కాలువలో క్షేత్రస్థాయిలో వ్యర్థాల తొలగింపు పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా బయాలజిస్ట్ సూర్య కుమార్ నాయక్ మాట్లాడుతూ, బుడమేరు కాలువలో నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్లాస్టిక్ వ్యర్థాలు, గుర్రపుడెక్క మొక్కలను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో బుడమేరు కాలువ పొడవునా అవసరమైన ప్రాంతాల్లో వ్యర్థాల తొలగింపు పనులు నిరంతరాయంగా చేపడుతున్నామని వివరించారు. తుఫాన్ నేపథ్యంలో వర్షపు నీటి ప్రవాహం పెరిగినప్పటికీ కాలువలో నీరు సజావుగా ప్రవహించేలా సంబంధిత సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
మరోవైపు, వర్షాల కారణంగా నీరు నిలిచే ప్రాంతాల్లో దోమల ఉత్పత్తిని నివారించి ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఫాగింగ్, ఎంఎల్ ఆయిల్ స్ప్రేయింగ్, యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కాలువల్లో పూడిక తొలగించడం, ఖాళీ స్థలాల్లో నీటి నిల్వలు లేకుండా చూడటం వంటి చర్యల ద్వారా నగరంలో పారిశుధ్య నిర్వహణను నిరంతరం కొనసాగిస్తున్నామని తెలిపారు.
