అర్ణబ్ తుఫాన్ నేపథ్యంలో ప్రమాదకర చెట్ల కొమ్మల తొలగింపు

-నగరంలో 15 బృందాలతో 40 మంది సిబ్బంది ద్వారా ముందస్తు చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో అర్ణబ్ తుఫాన్ నేపథ్యంలో నగరంలో వీస్తున్న బలమైన ఈదురుగాలుల కారణంగా ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా డిప్యూటీ డైరెక్టర్, హార్టికల్చర్ పర్యవేక్షణలో నగర పరిధిలో ప్రమాదకర స్థితిలో ఉన్న చెట్లను గుర్తించి, వాటి కొమ్మలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్, హార్టికల్చర్ మాట్లాడుతూ, విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు, వాహనదారులకు ప్రమాదం కలిగించే అవకాశం ఉన్న చెట్లను గుర్తించి, వాటి ప్రమాదకరమైన కొమ్మలను ముందుగానే తొలగిస్తున్నట్లు తెలిపారు. బలమైన ఈదురుగాలులు వీచినప్పుడు చెట్ల కొమ్మలు విరిగి పడటం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున, వాటిని నివారించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. భారీ వృక్షాల కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా క్షేత్రస్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేసి చర్యలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

అలాగే, నగరంలో ఎక్కడైనా చెట్లు కూలిపోయినట్లు లేదా చెట్ల కొమ్మలు విరిగి పడినట్లు ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత సిబ్బంది అక్కడికి చేరుకుని వాటిని తొలగిస్తున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నగరవ్యాప్తంగా మొత్తం 15 ప్రత్యేక బృందాలతో 40 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. చెట్ల కొమ్మల తొలగింపు, కూలిన చెట్లను తొలగించడం వంటి పనుల కోసం 14 చైన్‌సాలు, 7 జేసీబీలు, 3 ట్రాక్టర్లను వినియోగిస్తూ సహాయక చర్యలు నిరంతరంగా కొనసాగిస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్, హార్టికల్చర్ తెలిపారు.