– రైతులకు అండగా నిలవాలి.. పంటల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారించాలి
– క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలి
– వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఆర్నాబ్ తుఫాను నేపథ్యంలో పంట నష్టాన్ని సాధ్యమైనంత వరకు నివారించడంతో పాటు రైతులకు అండగా నిలిచేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. బుధవారం వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఉన్నతాధికారులు, జిల్లా స్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పంటల సంరక్షణ, పునరుద్ధరణ, సహాయక చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామస్థాయి వ్యవసాయ సహాయకుడి నుంచి రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు, ఇప్పటికే కోసిన పంటలు, ధాన్యం నిల్వలు దెబ్బతినకుండా రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించాలని ఆదేశించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించిన వెంటనే అధికారులు గ్రామాల్లో పర్యటించి రైతులతో నేరుగా మాట్లాడాలని సూచించారు. నీటమునిగిన పంటలను కాపాడేందుకు పొలాల్లో నిలిచిన నీటిని తొలగించడం, పంటల పునరుద్ధరణకు అవసరమైన చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
పంట నష్టాన్ని గ్రామాలవారీగా, పంటలవారీగా, రైతులవారీగా అంచనా వేసి ప్రాథమిక నివేదికలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పంపించాలని, అనంతరం సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతి రైతు సమస్యపై సానుకూలంగా స్పందించి సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నష్టపోయిన రైతుల వివరాలను త్వరితగతిన సేకరించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి రైతుకూ సకాలంలో సహాయం అందేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. తుఫాను సమయంలో రైతులకు భరోసా కల్పించడమే అధికారుల ప్రథమ కర్తవ్యమని, క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యానికి తావులేకుండా సమష్టిగా పనిచేయాలని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, వ్యవసాయ శాఖ కమిషనర్ మంజీర్ జిలానీ, ఉద్యానవన శాఖ కమిషనర్ శ్రీనివాసులుతో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
