గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సౌర విద్యుత్ వినియోగం ద్వారా పర్యావరణహితంతో పాటు, ఖర్చులు కూడా తగ్గించుకొని ఆదాయం పెంచుకునే అవకాశం ఉందని గుంటూరు నగర కమిషనర్ (ఎఫ్ఏసి) ఎస్.హరికృష్ణ తెలిపారు. మంగళవారం సంగంజాగర్లమూడి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పై ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ ని నగరపాలక సంస్థ ఈఈ కొండారెడ్డి, డిఈఈ శ్రీధర్ లతో కలిసి కమిషనర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత ప్లాంట్ విస్తీర్ణం, విద్యుత్ ఉత్పత్తి, వినియోగం తదితర వివరాలను ఇంజినీరింగ్ అధికారులని అడిగి తెలుసుకొని, మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తుందని, అందులో భాగంగా సంగంజాగర్లమూడి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో యునిడో సహకారంతో 2 ఎకరాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. షుమారు రూ.4.75 కోట్లతో 500 కిలోవాట్ల సామర్ధ్యంతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ రోజుకి సరాసరి 2వేల యూనిట్ల విద్యుత్ ని ఉత్త్పత్తి చేస్తుందన్నారు. జాగర్లమూడి నుండి గుంటూరు నగరానికి త్రాగునీరు సరఫరా చేసే మోటార్ల రన్నింగ్ కోసం రోజుకి 650 నుండి 1300 యూనిట్లను వినియోగించుకొని మిగిలిన యూనిట్లను గ్రిడ్ కు అమ్మడం జరుగుతుందని తెలిపారు. సోలార్ ప్లాంట్ వలన ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ని మోటార్ల రన్నింగ్ కు వినియోగించడం ద్వారా రోజుకి షుమారు రూ.12,350 ఖర్చులు తగ్గుతుండగా, మిగిలిన విద్యుత్ అమ్మకం ద్వారా రోజుకి షుమారు రూ.4,555 ఆదాయం వస్తుందని పెర్కొన్నారు. వేసవికాలంలో ఆదాయం పెరిగే అవకాశం ఉందన్నారు. ప్లాంట్ నిర్వహణను కాంట్రాక్ట్ సంస్థే 15 ఏళ్లు భాధ్యత తీసుకుంటుందని, మరో 10 ఏళ్లు పొడిగించుకునే అవకాశం ఉందని తెలిపారు. ప్లాంట్ నుండి ప్రతి రోజు ఉత్పత్తి అవుతున్న విద్యుత్, వినియోగం, అమ్మకం తదితర వివరాలను సమగ్రంగా ప్రత్యేక రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో సోలార్ ప్లాంట్ ఏర్పాటు వలన చెరువులో నీటి ఆవిరి శాతాన్ని తగ్గించవచ్చని, ప్లాంట్ ఏర్పాటుకు అదనంగా భూమి కేటాయింపు అవసరం లేదన్నారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ ల ఏర్పాటు వలన బహుళ ప్రయోజనాలు ఉంటాయని, రానున్న కాలంలో నగరపాలక సంస్థ ఖాళీ స్థలాల్లో ప్లాంట్ ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …