మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎందరో అమర జీవుల త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్రం లభించిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జిల్లా పర్యాటక, యువజన సంక్షేమ, క్రీడలు, విద్య శాఖల తోపాటు నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో మచిలీపట్నం చాంబర్ ఆఫ్ కామర్స్ సహకారంతో బుధవారం స్థానిక కోనేరు సెంటర్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రారంభించి, విద్యార్థులు అధికారులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు ఈరోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు ఎంతోమంది అమర జీవుల త్యాగాల ఫలితంగా మనకు లభించిన స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలని, వీరి స్ఫూర్తితో దేశభక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమం మనందరిలో దేశభక్తిని పెంపొందిస్తుందని అన్నారు. మచిలీపట్నం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, నగరంలో వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. 365 అడుగుల జాతీయ జెండాను చేతపట్టి స్వాతంత్ర ఉద్యమ ఘటనను గుర్తుచేస్తూ దేశ సమగ్రతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, వందేమాతరం నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్వో శ్రీదేవి, జిల్లా పర్యాటక అధికారి రామ్ లక్ష్మణ్ ,స్పోర్ట్స్ అథారిటీ అధికారి ఝాన్సీ లక్ష్మి, నెహ్రు యువ కేంద్రం అధికారి సుంకర రాము, జిల్లా యువజన సంక్షేమ అధికారి డి. సుబ్బారావు, ఉప విద్యాశాఖ అధికారి శేఖర్ సింగ్, ఎంఈఓ దుర్గాప్రసాద్, తాసిల్దారు కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.