-రూ.160 కోట్లతో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన
-ప్రజాదర్భార్ కార్యక్రమం నిర్వహించి అర్జీలు స్వీకరించిన మంత్రి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వివిధ అభివృద్ధి పనులను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులను వెచ్చిస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సోమవారం ఉదయం స్థానిక బృందావన థియేటర్ పక్కన గల నియోజకవర్గ టీడీపి కార్యాలయంలో ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాదర్భార్ కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన పాలనను అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రతివారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటివరకు ప్రతివారం ఆరుసార్లు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి పెద్ద మొత్తంలో అర్జీలను స్వీకరించామని, ముఖాముఖిగా వారి సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటివరకు దాదాపు 1,338 అర్జీలు స్వీకరించామని, వాటిలో 970 సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. పింఛన్లు, రోడ్లు, డ్రైనేజీలు, వంతెనల నిర్మాణాలు తదితర అంశాలకు సంబంధించిన దాదాపు 268 అర్జీలు పెండింగ్ లో ఉన్నాయని, త్వరలో వాటిని కూడా పరిష్కరిస్తామన్నారు.
జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.160 కోట్ల నిధులను తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గంలోని గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, స్మశాన వాటికలకు కాంపౌండ్ వాల్స్ నిర్మాణం నిమిత్తం రూ.30 కోట్ల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపామన్నారు. అదేవిధంగా జల జీవన్ మిషన్ పథకం కింద రూ. 220 కోట్ల నిధులతో ఇంటింటికి నీటి కొళాయి అందిస్తామన్నారు. రూ. 105 కోట్లతో చిలకలపూడి రైల్వే ట్రాక్ నుంచి పెదపట్నం వరకు, అదేవిధంగా ఖాలేకాన్ పేట నుంచి శారదా నగర్ దిగువన ఉన్న గ్రామపంచాయతీలకు రూ.115 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామని త్వరలోనే అందుకు సంబంధించిన పనులను చేపట్టి రక్షిత మంచినీరు అందిస్తామన్నారు. అమృత్ ఫేజ్-2 కింద మచిలీపట్నం నగర పాలక సంస్థ పరిధిలో పెద్ద ఎత్తున మ్యాచింగ్ ఫండ్స్ మంజూరుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ టిడ్కో ఇళ్లను మంజూరు చేసి ఈ శ్రావణమాసం పూర్తయ్యేలోపే గృహ ప్రవేశాలు చేయిస్తామన్నారు.
స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఉద్యోగులందరూ పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలందరూ సహకరించి భాగస్వామి కావాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, స్థానిక నాయకులు బండి రామకృష్ణ, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపిచంద్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.