అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నారావారిపల్లె నుంచి వచ్చిన దివ్య తెలుగుతేజం నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రి అయి నేడు 30వ ఏటలో అడుగు పెడుతున్నారు! ఆర్ధికశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేయడం చంద్రబాబు ప్లస్ పాయింట్! 28 ఏళ్లకే ఎమ్మెల్యే అయి కుర్రాడిగా అసెంబ్లీలో అడుగు పెట్టి, కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయిన చంద్రబాబు భవిష్యత్ ముఖ్యమంత్రి అని అప్పట్లో ఎవ్వరూ ఊహించి ఉండరు ఒక్క వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మినహా! కాంగ్రెస్ పార్టీ వదిలి తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు, ఎన్టీఆర్ కు అల్లుడు అయినప్పుడు కూడా ఎవ్వరూ పెద్దగా గుర్తించలేదు ఒక్క దగ్గుబాటి వెంకటేశ్వరరావు మినహా!
లక్ష్మీపార్వతి పెత్తనం ఎక్కువైనప్పుడు అప్పటి అత్యంత ముఖ్యమైన నాయకులను ఒక్క తాటిపైకి తీసుకు రావడంలో, ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించడంలో, పార్టీ పగ్గాలు చేతబట్టి తన 45వ ఏట ముఖ్యమంత్రి అయిపోవడం వెనుక చంద్రబాబు చాణక్య ఆలోచనలు ఒక్కసారిగా జనానికి తెలిసి వచ్చాయి! అప్పటికే ఆర్ధిక రెవెన్యూ శాఖల మంత్రిగా ఆయన చేపట్టిన సంస్కరణలు, నాయకత్వ లక్షణాలు, కొందరిని పక్కన పెట్టడాలు, కొందరిని కలుపుకుపోవడాలు వెరసి ఒక గొప్ప నాయకుడిగా ఆయన్ని తెలుగుదేశం నాయకులే తీర్చిదిద్దారు! ప్రతి నాయకుడిలో ఒక మంచి లక్షణం ఉంటుంది! రెండో కోణమూ ఉంటుంది! వాటన్నిటిని చూస్తూ తనకు తాను మలుచుకుంటూ ఎదిగిన తీరు నిజంగా ఆశ్చర్యమే! స్ఫూర్తిదాయకమే!
ఎన్నో ఆటు పోట్లు! ఎన్నో ఎదురు దెబ్బలు! మరెన్నో నిద్ర లేని సంఘర్షణలు! పార్టీ వెనకడుగు, ప్రభుత్వం పై మరకలు వాటిని తుడిచే ప్రయత్నంలో వెన్నుపోటు అనే అతి పెద్ద ముద్ర ప్రతిపక్షం నుంచి, గిట్టని వారి నుంచి శాశ్వతంగా వేయించుకున్నారు! కాంగ్రెస్ పార్టీ అభిమానులు ముఖ్యంగా వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి వీరాభిమానులు బలంగా నమ్మారు! నిజానికి ఆ తరువాత వచ్చిన ఎన్నికల్లో జనం హారతి పట్టారు! అయినా అవకాశంగా మలుచుకుని అప్పటి ప్రతిపక్షం వెన్నుపోటు అనే ముద్ర బలంగా వేసింది! ఇప్పటికీ అదే ముద్ర వెంటాడుతూనే వుంది అరిగిపోయిన రికార్డులా! అయినా పంటి బిగువన భరించడం చంద్రబాబుకే సాధ్యం!
నిజానికి చంద్రబాబు భయస్తుడు! కానీ, సంకల్ప బలం ఎక్కువ కాబట్టి నిలదొక్కుకోగలిగాడు! పోరాట పటిమ ఆయన్ని మడమ తిప్పనివ్వదు! ప్రతిపక్షంలో వున్నప్పుడు అందరిని కలుపుకుపోతుంటారు! కార్యకర్తలతో కలసిపోతుంటారు! అధికారంలోకి వస్తే మాత్రం అప్పటి వరకు కష్టపడిన నమ్ముకున్న వాళ్ళను నిర్దాక్షిణ్యంగా దూరం పెట్టేస్తారు! వేరే కోటరీ వచ్చేస్తుంది! అధికారం పోగానే ఆ కోటరీ మాయమైపోతుంది! మళ్ళీ పార్టీ కోసం కష్టపడే వాళ్ళను చేరదీసి ప్రోత్సహించి అధికారంలోకి రావడానికి సుగమం చేసుకుంటారు! ఇది ఇప్పటి నుంచే కాదు! గత మూడు పర్యాయాలు అదే జరిగింది! ఇప్పుడూ అదే జరుగుతోంది! దీనికి ఒకే ఒక్క కారణం ప్రభుత్వంలో అధికారంలో వున్నప్పుడు తప్పు జరగకూడదని నిరంతరం ఆయన భయపడుతూ ఉంటారు!
అభివృద్ధి సంక్షేమం చంద్రబాబు విజన్! అప్పట్లో 2020, ఇప్పుడూ 2047 వికసిత్ ఆంధ్రప్రదేశ్! చంద్రబాబు తన ఆలోచనలతో శంఖుస్థాపనలు చేసి అనుకున్నది పూర్తి చేస్తాడు! కానీ, అది ప్రారంభించే సమయానికి ఆయన పదవిలో ఉండరు! మొత్తానికి ఇటు ప్రస్తుత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో చంద్రబాబు అభివృద్ధి చేసినవి ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి! మహానేతలు రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయి ఉండొచ్చు కానీ, చంద్రబాబులా ముందుచూపు దార్శనికత మరొకరిలో చూడలేం! అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మరో నాయకుడిని మనం చెప్పుకోలేం! ఎందుకంటే, చంద్రబాబులా నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యే అదృష్టం ఇంకెవ్వరికి మన తెలుగు రాష్ట్రాల్లో రాలేదు! చంద్రబాబు రికార్డు భవిష్యత్ లో కూడా చెదరకపోవచ్చు!
చంద్రబాబులో దూకుడు కనిపించదు! స్థితప్రజ్ఞత కనిపిస్తుంది! అచి తూచి నిర్ణయాలు తీసుకోవడమే అతని బలం! అదే అతని బలహీనత! అక్రమాలు, అవినీతి లేని నాయకులు ఈ కాలంలో ఒక్కరిని కూడా చూడలేం! ఎందుకంటే, పార్టీలు నిలబడాలన్నా, రాజకీయ రంగంలో కొనసాగాలన్నా అంతా డబ్బుతో ముడి పడిన వ్యవహారమే! సొంత డబ్బులు ఎవ్వరూ ఖర్చు పెట్టరు! పెట్టినా ఆతరువాత అంతకంతకు తీసుకోక తప్పదు! ఇందులో చంద్రబాబు మినహాయింపు కాదు! తన కోసం చేయకపోయినా పార్టీ బలోపేతం కోసం చేయకతప్పదు!
నాలుగు దశాబ్దాల అనుభవంలో ఆయన మీడియా ముందు ఏడ్చింది ఒకే ఒక్కసారి! అదీ అసెంబ్లీలో ఎదుర్కొన్న అవమాన భారం! అలాగే ఎన్నో కేసులు చుట్టు ముట్టినప్పటికి అన్నింట్లో స్టే తెచ్చుకుంటూ నెట్టుకు రాగలిగారు! కానీ, స్కిల్ నైపుణ్యం కేసులో ఆధారాలు లేకున్నా జైలు జీవితం గడపకా తప్పలేదు! ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో దారుణాలు చవి చూశారు! అయినా తొణకని అసాధారణ రాజకీయవేత్త చంద్రబాబు! నిజానికి ఆయన్ని ఒక దీర్ఘ మొండి వ్యాధి చుట్టు ముట్టి రోజూ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఎన్నో ఏళ్ళుగా! కానీ, ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ఏమో గానీ, 50 డిగ్రీల ఎండలో చెమటలు కారుతున్నా చలించక మొండిగా ప్రచారం చేసి ముఖ్యమంత్రి అయి సాధించారు 74వ ఏట!
రాజకీయ రంగంలో రాణించడం అంత సులభం కాదు! సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం అందరికి అసాధ్యం! కానీ, చంద్రబాబు నాయుడు అవకాశం వచ్చిన ప్రతిసారి తన విలక్షణత చాటుకుంటూనే వచ్చారు! అవకాశం వచ్చినప్పుడు చక్రం తిప్పే అపర చాణుక్యుడుగా పేరు గడించారు! ఆయనకు ఎంత మంది వీరాభిమానులు వున్నారో అంతకంతకు ద్వేషించే వాళ్ళు ఉన్నారు! ఆయన వర్గానికి అంట కాగుతారనే కక్ష కావచ్చు, అసలు ఆ వర్గం పొడ గిట్టని వాళ్ళు ఆయన్ని దారుణంగా ద్వేషిస్తూ ఉంటారు! కానీ, చంద్రబాబు అవేవి పట్టించుకోరు! నెగటివిటీ దరి చేరనివ్వరు! పాజిటివ్ దృక్పథంతో ముందుకు పోతూనే ఉంటారు! అసూయ ద్వేషాలు ఆయనలో కనిపించవు! ఆయన్ని తిట్టినవారిని సైతం మళ్ళీ మళ్ళీ ఆయనే కలుపుకుపోతుంటారు! అలాంటి వాళ్లతో సర్దుకు పోతుంటారు! అదే చాణక్య రాజకీయం! అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు, విభజిత ఆంధ్రప్రదేశ్ లో రెండవసారి ముఖ్యమంత్రి అయిన తొలి తెలుగు తేజం నారా చంద్రబాబు నాయడే!
రాజకీయ రంగంలో ఎక్కువ కాలం ఉండాలంటే ఆరోగ్యం ముఖ్యం! క్రమశిక్షణ ఆరోగ్యం సరైన ఫిట్ నెస్ తో యువతకు స్ఫూర్తినిచ్చిన నేత చంద్రబాబు! చంద్రబాబుకు ముందు అనంతరం ఎంతో మంది మేధస్సుగల నేతలు వచ్చినా ఆరోగ్యం కాపాడుకోలేక ఎందరో వెళ్లిపోయారు! ఈ వయసులోనూ రోజుకు 18 గంటలు శ్రమిస్తూ ఎందరినో తీర్చిదిద్దుతూ ముందుకు దూసుకెళుతున్న మహా శ్రామిక నేత చంద్రబాబు! ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయనొక ఘన చరిత్ర! తెలుగు రాజకీయ రంగంలో చంద్రబాబు పేరు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది! మార్మోగుతూనే ఉంటుంది!