Breaking News

రాష్ట్రానికి పూర్తి మ‌ద్ద‌తు, స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తాం

– గ‌త ప్ర‌భుత్వం బుడ‌మేరు స‌మీపంలో నిర్వ‌హించిన అక్ర‌మ త‌వ్వ‌కాలు కూడా విప‌త్తున‌కు ఒక కార‌ణం
– రాష్ట్ర‌, కేంద్ర ప్ర‌భుత్వ విప‌త్తు స్పంద‌న బ‌ల‌గాలు క‌లిసిక‌ట్టుగా ప‌నిచేసి సేవ‌లందించాయి
– దేశంలోనే మొద‌టిసారిగా స‌హాయ‌క చ‌ర్య‌ల్లో డ్రోన్ల‌ను భాగం చేయ‌డం ఓ మంచి ఆలోచ‌న‌
– అంటువ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలు
– క‌లెక్ట‌ర్ కార్యాల‌యాన్ని క్యాంపు కార్యాల‌యంగా మార్చుకొని
అధికార బృందానికి ముఖ్య‌మంత్రి నేతృత్వం వ‌హించారు
– అవ‌స‌ర‌మైన స‌హాయ‌కార్య‌క్ర‌మాల‌ను ముందుండి న‌డిపారు
– రైతుల‌కు పంట బీమా ప‌థ‌కం ద్వారా పూర్తి ల‌బ్ధి చేకూర్చుతాం
– ఇలాంటి విప‌త్తులు పున‌రావృతం కాకుండా ఉండేందుకు దీర్గ‌కాలిక ప్ర‌ణాళిక‌లు
– మీడియా స‌మావేశంలో కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని విజ‌య‌వాడ న‌గ‌రంలో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో కురిసిన 400 మిమీ వ‌ర్ష‌పాతం వ‌ల్ల వ‌ర‌ద విప్త‌తు సంభ‌వించింద‌ని.. బుడ‌మేరుకు ప‌డిన గండ్లువ‌ల్ల విజ‌య‌వాడ‌కు ఇలాంటి క్లిష్ట‌మైన వ‌ర‌ద ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.
గురువారం మంత్రివ‌ర్యులు క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుతో క‌లిసి మీడియా స‌మావేశంలో మాట్లాడారు.
ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు క‌లెక్ట‌ర్ కార్యాల‌యాన్ని త‌న క్యాంపు కార్యాల‌యంగా మార్చుకొని అధికార బృందానికి నేతృత్వం వ‌హిస్తూ 24 గంట‌లూ శ్ర‌మించి స‌హాయ కార్య‌క్ర‌మాల‌ను ముందుండి న‌డిపినందుకు వారికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాన‌న్నారు. ఇలాంటి సంక్లిష్ట‌మైన వ‌ర‌ద ప‌రిస్థితుల్లో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో ప‌నిచేయ‌డం.. దానికి గౌర‌వ ముఖ్య‌మంత్రి నాయ‌క‌త్వం వ‌హించ‌డం గొప్ప విష‌య‌మ‌ని అన్నారు. ఈ సంక‌ట ప‌రిస్థితిని కేంద్ర ప్ర‌భుత్వం గుర్తించింద‌ని.. ఈ రాష్ట్రానికి పూర్తి మ‌ద్ద‌తును, స‌హాయ‌స‌హ‌కారాల‌ను కేంద్రం అందిస్తుంద‌ని అన్నారు. ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థ‌న మేర‌కు వారుకోరిన విధంగా ఎన్‌డీఆర్ఎఫ్ బృందాల‌ను, వైమానిక హెలికాప్ట‌ర్ల‌ను ప్ర‌ధాన‌మంత్రి వెంట‌నే పంప‌డం జ‌రిగింద‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వ, కేంద్ర ప్ర‌భుత్వ విప‌త్తు స్పంద‌న బ‌ల‌గాలు క‌లిసిక‌ట్టుగా ప‌నిచేసి వ‌ర‌ద‌బారిన‌ప‌డిన ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌డం, వారికి దైనందిక అవ‌స‌రాల‌ను తీర్చ‌డంలో కృషిచేశాయ‌ని మంత్రి పేర్కొన్నారు.

స‌రైన రీతిలో రాష్ట్ర ప్ర‌భుత్వం స్పందించింది:
రాష్ట్ర ప్ర‌భుత్వం స‌రైన రీతిలో స్పందించిన కార‌ణంగానే మ‌ర‌ణాలు ఇంత త‌క్కువగా సంభ‌వించాయ‌ని.. లేకుంటే పరిస్థితి వేరుగా ఉండేద‌ని మంత్రి తెలిపారు. వ‌ర‌ద నీటిలో అధికారులు, అన‌ధికారులు, ఎన్నికైన ప్ర‌జాప్ర‌తినిధులు క‌ల‌సి ప‌నిచేయ‌డం ప్ర‌జ‌ల సంక్షేమానికి నిల‌బ‌డ‌టం హ‌ర్ష‌ణీయ‌మ‌ని అన్నారు. న‌గ‌రంలోని వ‌ర‌ద విప‌త్తు ఏర్ప‌డిన ప్రాంతాల‌కు ఐఏఎస్ అధికారుల‌ను నియ‌మించి జ‌వాబుదారీత‌నంతో స‌హాయ‌క కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డాన్ని ఆయ‌న ప్ర‌శంసించారు. వ‌ర‌ద ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన నేను గ‌త అయిదు రోజులుగా వ‌ర‌ద నీటిలో ఉన్న బాధితుల‌ను ప‌రామ‌ర్శించి, ప్ర‌భుత్వం అందించిన సేవ‌ల‌ను అడిగి తెలుసుకున్నాన‌ని.. అంద‌రూ వారికి కావాల్సిన నిత్యావ‌స‌రాలైన ఆహారం, పాలు, నీరు స‌కాలంలో ప్ర‌భుత్వం అందించింద‌ని తెలిపార‌ని వివ‌రించారు. దేశంలోనే మొట్ట‌మొద‌టిసారిగా సాంకేతిక‌త‌ను వినియోగించి.. వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల్లో భాగంగా డ్రోన్ల స‌హాయంతో ఆహార ప్యాకెట్లు, మంచినీటి బాటిళ్లను బాధితుల‌కు చేర‌వేయ‌డం మంచి ఆలోచ‌న అని మంత్రి కొనియాడారు.

కేంద్ర పంట‌ల బీమా ప‌థ‌కం ద్వారా రైతుల‌కు పూర్తి ల‌బ్ది:
కేవ‌లం వ‌ర‌ద స‌హాయక కార్య‌క్ర‌మాలే కాకుండా వ‌ర‌ద నీరు త‌గ్గాక పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాల‌తో పాటు ఫైర్ ఇంజిన్ల ద్వారా ఇళ్ల‌ను, రోడ్ల‌ను శుభ్ర‌ప‌ర‌చ‌డం.. అంటువ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం.. వీట‌న్నింటినీ స్వ‌యంగా ముఖ్య‌మంత్రి ప‌ర్య‌వేక్షించ‌డం హ‌ర్ష‌నీయ‌మ‌ని మంత్రి అన్నారు. బుడ‌మేరుకు పడిన గండ్ల‌ను పూడ్చ‌డానికి కేంద్ర ర‌క్ష‌ణ బ‌ల‌గాల స‌హాయం అవ‌స‌ర‌మ‌ని ముఖ్య‌మంత్రి కోరార‌ని.. ఆ గండ్ల‌ను పూడ్చి వ‌ర‌ద‌ను ఆపాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. అందుకే వారు కోరిన విధంగా త్వ‌ర‌లోనే బ‌లగాల‌ను పంపిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఈ విప‌త్తును భ‌విష్య‌త్తులో రాకుండా ఎదుర్కొనేందుకు కొన్ని స్వ‌ల్ప‌కాలిక‌, మ‌రికొన్ని దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక‌ల ద్వారా చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని అన్నారు. 70 సంవ‌త్స‌రాల ప్ర‌కాశం బ్యారేజ్‌కు 11.90 ల‌క్ష‌ల క్యూసెక్కుల ప్ర‌వాహాన్ని త‌ట్టుకునే సామ‌ర్థ్యం ఉంద‌ని.. అయితే ఒకేసారి వ‌ర‌ద ముంపును త‌ట్టుకొనే సామ‌ర్థ్యాన్ని పెంచే విష‌య‌మై ప్ర‌ణాళిక‌ను రూపొందించాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని ముఖ్య‌మంత్రి కోరిన విధంగా ఈ విష‌యాన్ని అంచ‌నా వేసేందుకు కేంద్ర‌బృందాన్ని కేంద్ర హోంమంత్రివ‌ర్యులు అమిత్‌షా పంప‌డం జ‌రిగింద‌ని.. దీనిపై త‌గు నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించారు. గ‌త ప్ర‌భుత్వం బుడ‌మేరు స‌మీపంలో నిర్వ‌హించిన అక్ర‌మ త‌వ్వ‌కాలు కూడా వ‌ర‌ద విప‌త్తున‌కు ఒక కార‌ణ‌మ‌ని అన్నారు. ఏదేమైన‌ప్ప‌టికీ 1.80 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో రెండు ల‌క్ష‌ల మంది రైతుల‌కు వ్య‌వ‌సాయ, ఉద్యానవ‌న పంట‌ల న‌ష్టం వాటిల్లింద‌ని తెలిపారు. న‌ష్టాన్ని అంచ‌నా వేసేందుకు ఎన్‌డీఆర్ఎఫ్‌, వ్య‌వ‌సాయ, ప్ర‌ణాళిక‌ బృందాలు ఇప్ప‌టికే త‌మ ప‌ని ప్రారంభించార‌ని.. గ‌త ప్ర‌భుత్వం పంట‌ల బీమా ప్రీమియం క‌ట్టని కార‌ణంగా రైతుల‌కు న‌ష్టం వాటిల్లింద‌ని.. ప్ర‌స్తుత ఎన్‌డీఏ ప్ర‌భుత్వం ఆ త‌ప్పిదం చేయ‌ద‌ని.. కేంద్ర పంట‌ల బీమా ప‌థ‌కం ద్వారా వ‌చ్చే ల‌బ్ధిని రైతుల‌కు పూర్తిగా ద‌క్కుతుంద‌ని అన్నారు. విప‌త్క‌ర స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌బ‌డ‌ట‌మే ఎన్‌డీఏ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని గౌర‌వ ప్ర‌ధాన‌మంత్రి మోదీ రాష్ట్ర ప్ర‌భుత్వానికి కావాల్సిన అన్ని ర‌కాల స‌హాయ‌స‌హ‌కారాల‌ను అందిస్తుంద‌ని.. ఇప్ప‌టికే రాష్ట్రానికి విచ్చేసిన కేంద్ర బృందాలు త‌మ అంచ‌నాల‌ను కేంద్రానికి స‌మ‌ర్పిస్తాయ‌ని తెలిపారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు స‌మైఖ్యంగా సంక‌ట ప‌రిస్థితుల నుంచి ప్ర‌జ‌ల‌ను గ‌ట్టెక్కించే ప్ర‌య‌త్నం చేస్తూ దీర్ఘ‌కాలిక ప్రణాళిక ద్వారా ఇలాంటి స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం కాకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని శ్రీ శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ ఉద్ఘాటించారు.

రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారాచంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ..  ప్రకాశం బ్యారేజిని 11.90 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహానికి వీలుగా డిజైన్ చేశారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు వివరించారు. అయితే వారం రోజుల క్రితం కృష్ణా పరివాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో 11 లక్షల 43 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. క్లౌడ్ బ‌రెస్ట్ అయిన విధంగా ఒకే రోజు విజయవాడ నగరంలో 40 సెం.మీ. వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు.

గ‌త ప్ర‌భుత్వ చ‌ర్య‌ల వ‌ల్లే వ‌ర‌ద విప‌త్తు:
అదే విధంగా బుడమేరును సుమారు ఏడు వేల క్యూసెక్కుల నీటి సామర్థ్యంతో డిజైన్ చేయగా 30వేల క్యూసెక్కుల వరకూ నీరు రావడంతో మూడుచోట్ల గండ్లు పడి విజయవాడ నగరంలోని పలు లోతట్టు కాలనీలు ముంపునకు గురయ్యాయని ముఖ్య‌మంత్రి చంద్రబాబు వివరించారు. 2019లో బుడమేరు మరమ్మత్తులకు అయిదు పనులు మాంజూరు చేయగా గత ప్రభుత్వం ఆ పనులు చేయక నిలిపి వేయడంతో నేడు పలుచోట్ల గండ్లు పడి ఈ పరిస్థితులు తలెత్తాయని ముఖ్య‌మంత్రి పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీ సామర్థ్యాన్ని 15 లక్షల క్యూసెక్కులకు పెంచేందుకు ఒక సాంకేతిక బృందంతో అధ్యయనం చేయిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు మీడియాకు వివరించారు. అలాగే బుడమేరుకు మరమ్మత్తులతో పాటు ఆధునికీక‌ర‌ణ‌కు చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. ఏటిగ‌ట్ల‌ను కూడా పటిష్టం చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

బుడమేరు వరదలతో విజయవాడ నగరంలో చాలా కాలనీలు వరద ముంపునకు గురై వేలాది గృహాలు దెబ్బతినడంతో పాటు ఇళ్ళలోని విలువైన సామానులు కూడా దెబ్బతిన్నాయని సీఎం చెప్పారు. బుడమేరు గండ్లను పూడ్చేందుకు ఆర్మీ బృందం కూడా రానుందని అన్నారు. వర‌ద‌ల వల్ల కలిగిన నష్టంపై కేంద్రానికి నివేదిక పంపుతున్నట్టు తెలిపారు. కేంద్ర బృందం కూడా గురువారం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించిందని అన్నారు.

వ‌ర‌ద న‌ష్టంపై ఫొటో ఎగ్జిబిష‌న్‌:
అంతకు ముందు వరద నష్టంపై విజయవాడ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. ముఖ్య‌మంత్రి చంద్రబాబుతో కలిసి తిలకించారు. కృష్ణా నది, బుడమేరు వరద ముంపునకు గురైన ప్రాంతాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్‌, పోలీసు తదితర విభాగాల ద్వారా రెస్క్యూ, సహాయ పునరావాస చర్యలు, ఆహారం, తాగునీరు, ఇతర సహాయ చర్యలను, జరిగిన పంట, ఆస్తి, పశు నష్టం వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, సమాచార శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా కేంద్రమంత్రికి వివరించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్, రాష్ట్ర మంత్రులు కె.అచ్చెన్నాయుడు, నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్‌, జి.సంధ్యారాణి, వంగల పూడి అనిత, బిసి.జనార్థన్ రెడ్డి, ఎంపీలు కేశినేని చిన్ని, డి.పురంధేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *