Breaking News

జిల్లాలో కేంద్ర బృందం పర్యటనకు ఏర్పాట్లు సిద్ధం

గన్నవరం/పెనమలూరు/నందివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల జిల్లాలో సంభవించిన అధిక వర్షాలు, వరదలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం నుండి ప్రత్యేక బృందం రానున్నదని, అందుకు వారి పర్యటనకు తగిన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వెల్లడించారు. రేపు బుధవారం 11వ తేదీన జిల్లాలో గన్నవరం, పెనమలూరు, కంకిపాడు, నందివాడ మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు తాత్కాలికంగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు కేంద్ర బృందం పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం ఆయా మండలాల్లోని ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. రేపు బుధవారం కేంద్ర బృందం జిల్లాకు విచ్చేసి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారన్నారు. ముఖ్యంగా వ్యవసాయ, ఉద్యాన పంటలు, ఆక్వా రంగానికి అధిక మొత్తంలో నష్టం వాటిల్లిందని, ముంపుకు గురయ్యి గృహాలు సైతం దెబ్బతిన్నాయని, జరిగిన ఈ నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించేందుకు తాత్కాలిక రూట్ మ్యాప్ ను సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

జిల్లాలోని భారీ వర్షాలు, వరదల నష్ట తీవ్రతను వివరించేందుకు గన్నవరం విమానాశ్రయంలోనీ సమావేశపు మందిరంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం ప్రొజెక్టర్, సౌండ్ సిస్టమ్ అదేవిధంగా సమావేశపు మందిరం వెలుపల ఛాయా చిత్ర ప్రదర్శన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. కేంద్ర బృంద సభ్యులకు భోజనం ఏర్పాట్లు, ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇతర వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. తొలుత ఆయన రామవరప్పాడు ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలోని ముస్తాబాద్ రహదారి పరిశీలించారు. దెబ్బతిన్న ఆ రహదారికి మరమ్మతులు చేపట్టేందుకు రూ.10 లక్షలతో అంచనాలు తయారు చేసినట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు. అనంతరం ఆయన గన్నవరం జాతీయ రహదారి వంతెన వద్ద బుడమేరు నది ప్రవాహాన్ని పరిశీలించారు. జిల్లాలో అధిక వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి వాస్తవాలను తెలియజేసేలా ఛాయచిత్రాలు, వీడియోలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. బుడమేరుకు సంబంధించిన మ్యాప్ లు, దాని ముంపు ప్రభావిత ప్రాంతాల వివరాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

పెనమలూరు మండలంలో ఎంఎల్ఏ తో కలసి పర్యటన..
పెనమలూరు మండలంలో ముంపు ప్రభావంతో దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలు, ఇళ్లను కేంద్ర బృందానికి చూపించేందుకు జిల్లా కలెక్టర్ స్థానిక శాసన సభ్యులు బోడే ప్రసాద్ తో కలసి పెదపులిపాక, ఎన్టీఆర్ నగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు ఇటీవలి వరద ముంపు పరిస్థితులపై స్థానికులతో మాట్లాడారు. రేషన్ కార్డులు లేకపోవడంతో తమకు నిత్యావసరాలు అందలేదని స్థానికులు కలెక్టర్, ఎంఎల్ఏ దృష్టికి తీసుకురాగా ఆధార్ కార్డు సహాయంతో సరుకుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. చోడవరంలో దెబ్బతిన్న పసుపు, అరటి, కంద, వరి, బొప్పాయి పంటలను పరిశీలించారు. పసుపు, కందకు లక్షన్నరకు పైగా పెట్టుబడి పెట్టామని, అధిక నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. కానీ పంట నష్టపోయినపుడు ఏ సీజన్ లో కూడా కంద పంటకు నష్టపరిహారం అందలేదని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, అందరికీ తగిన విధంగా న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

నందివాడ మండలంలో..
నందివాడ మండలం జొన్నపాడు నుండి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బస్సులో బయలుదేరి వెళ్లి నందివాడ, తుమ్మలపల్లి గ్రామాలలోని వరద ముంపు పరిస్థితులను పరిశీలించారు. యదేచ్చగా రొయ్యలు, చేపల చెరువుల తవ్వకాల వల్ల డ్రైనేజీ సరిగా లేక గ్రామాలు ముంపుకు గురయ్యాయని, దోసపాడు చానల్ గుర్రపు డెక్క, తూడుతో పూడుకుపోయి నీరు పారే అవకాశం లేకుండా పోయిందని గ్రామస్తులు కలెక్టర్కు వివరించారు.

గుడివాడ, ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ల అధికారులు పి పద్మావతి, డి రాజు, జిల్లా వ్యవసాయ అధికారిణి ఎన్ పద్మావతి, గుడివాడ మున్సిపల్ కమిషనర్ సుబ్రహ్మణ్యం, డ్రైనేజీ శాఖ ఈఈ విజయలక్ష్మి, ఏపీ మైక్రో ఇరిగేషన్ పీడీ విజయలక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ జిల్లా అధికారి శివ ప్రసాద్, సర్వ శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కె రాములు నాయక్, గన్నవరం, పెనమలూరు, నందివాడ మండలాల తహసీల్దార్లు శివయ్య, గోపాల్ కృష్ణ, మల్లిక ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *