గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారోగ్య పరిరక్షణకు నిరంతరం కృషి చేసే ప్రజారోగ్య కార్మికులకు వైద్య పరీక్షలు చేస్తున్న ఐటిసి బంగారు భవిష్యత్ ప్రతినిధులకు గుంటూరు నగరపాలక సంస్థ నుండి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. శుక్రవారం స్వచ్చత హి సేవాలో భాగంగా స్థానిక రెవెన్యూ కళ్యాణ మండపంలో ఐటిసి బంగారు భవిష్యత్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ ప్రజారోగ్య కార్మికులకు వైద్య పరీక్షలు, ఆర్ధిక పొదుపు పై అవగాహన శిబిరంలో నగర కమిషనర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర ప్రజల ఆరోగ్య రక్షణకు తెల్లవారుజాము నుండే విధుల్లో ఉండే ప్రజారోగ్య కార్మికులకు వైద్య పరీక్షలు, వారికి ఆర్ధిక అంశాలపై ఐటిసి బంగారు భవిష్యత్ ప్రతినిధులు అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. నగర కమిషనర్ గా భాధ్యతలు తీసుకున్న తర్వాత పారిశుధ్యం, త్రాగునీరు ప్రధమ ప్రాధాన్యతలుగా ప్రకటించామని, విజయవాడ వరద సహాయక చర్యల్లో పాల్గొన్నకార్మికులకు త్వరలో 2 జతల బట్టలు అందిస్తామన్నారు. అలాగే కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు జిఎంసి తరుపున నియోజకవర్గాల వారీగా మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. గతంలో ఊరంటే గుంటూరు పేరుతో పారిశుధ్యంలో మెరుగైన ఫలితాలు సాధించామని, త్వరలో మెరుగైన పారిశుధ్యంకు స్పెషల్ యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తామన్నారు. కార్మికుల సమస్యలపై నేరుగా తమ దృష్టికి తీసుకురావచ్చని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. కార్మికులు తమకు కేటాయించిన విధుల్లో అంకిత భావంతో పని చేయాలని కోరారు. స్వచ్చత హి సేవా 4వ రోజు నగరంలో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాలు జరిగాయన్నారు. నగర ప్రజలు స్వచ్చత హి సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా కార్మికులు అవగాహన కల్గించాలన్నారు.
డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మీ మాట్లాడుతూ నిత్యం వ్యర్ధాల మధ్య జీవనం గడిపే కార్మికులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలన్నారు. నగరంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో షుమారు 62 రకాల వైద్య పరీక్షలు, చికిత్సలు అందుబాటులో ఉన్నందున వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నగర కమిషనర్ గారి సూచనల మేరకు ప్రజారోగ్య కార్మికులకు త్వరలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేస్తామన్నారు.
ఐటిసి బంగారు భవిష్యత్ సీనియర్ ప్రోగ్రాం మేనేజర్ గౌరీ నాయుడు మాట్లాడుతూ స్వచ్చ భారత్ సాధనలో ముందు ఉండే కార్మికులకు అండగా ఉంటామన్నారు. కార్మికులకు వైద్య పరీక్షలు, ఆర్ధిక అంశాల పై అవగాహన కల్గిస్తామన్నారు. కార్మికుల పిల్లల్లో 18 నుండి 30 ఏళ్లలోపు, 8వ తరగతి పాస్ అయి, నిరుద్యోగులుగా ఉంటే వారికి తగిన వృత్తి శిక్షణ అందించి, ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు అందించేందుకు తోడ్పాటు ఇస్తామన్నారు.
అనంతరం కార్మికుల ఆరోగ్య భద్రత, ఆర్ధిక అంశాలపై అవగాహన పుస్తకాలను, పర్యావరణ హితంగా ఉండే గుడ్డ సంచులను కమిషనర్, ఇతర అతిధులు ఆవిష్కరించి, కార్మికులకు అందించారు.
కార్యక్రమంలో పోస్టల్ డిపార్ట్మెంట్ పిఆర్ఓ మాధవ్, శానిటరీ సూపర్వైజర్ సోమశేఖర్, ఐటిసి బంగారు భవిష్యత్ నుండి సురేష్, నిరంజన్, నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …