-ప్రభుత్వ ఏర్పడిన మొదటి 100 రోజుల్లోనే లబ్ధిదారులకు హామీలను అమలు చేసింది
-దేశంలోనే ఒక తిరుగులేని విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిది
-రాబోయే దీపావళి నుంచి ఉచిత సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నాం.
-సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రం ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వస్తుందని అందుకు ఈ వంద రోజుల్లో అమలు చేసిన కార్యక్రమాలే నిదర్శనమని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక 1,2,49,50 డివిజన్లకు సంబంధించి ముంబై కాలనీలో ఏర్పాటుచేసిన” ఇది మంచి ప్రభుత్వం” అనే కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, స్థానిక నాయకులు అధికారులతో కలిసి శాసనసభ్యులు ఆదిరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షోభంలోనూ సంక్షేమం అందించి, అభివృద్ధికి రెక్కలు తొడిగి, మొదటి 100 రోజుల్లోనే ‘ఇది మంచి ప్రభుత్వం!” అని ప్రజల చేత అనిపించుకుంటోంది కూటమి ప్రభుత్వం అన్నారు. పింఛన్లు ఒకేసారి రూ.1000 పెంచి రూ.4 వేలు ఇవ్వడం ఒకటైతే, మొదటి నెల ఒక్కొక్కరికీ రూ.7000లు చొప్పున ఒకేరోజు 65.18 లక్షల మందికి ఇంటింటికీ వెళ్లి రూ.4,408 కోట్లు పంపిణీ చేయడం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర అని ఆయన పేర్కొన్నారు. రూ.1674.47 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను చెల్లించి అన్నదాతను ఆదుకున్నారు. స్థానిక సంస్థలకు నిధులను అందించి పంచాయతీలకు ప్రాణం పోశామన్నారు. ఉద్యోగస్తులకు ఒకటవ తేదీన జీతాలు అందిస్తున్నామన్నారు. పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలతోనే ఆకలి తీర్చే 175 అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఏర్పడి గడిచిన వంద రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నెరవేర్చిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళుతున్నామన్నారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సుపరిపాలన అందించాలని దిశగా పనిచేస్తున్నాయన్నారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర సహకారం చేస్తుందని ఆ దిశగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల విజయవాడ నగరం వరదలలో ఆర్థిక నష్టాన్ని ఆపలేకపోయినా ప్రాణ నష్టం లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 రోజుల పాటు బస్సులో ఉండి, నిద్రాహారాలు మాని, ప్రజలను ఓ తండ్రిలా కాపాడారని ఆయన పేర్కొన్నారు.
రాబోయే దివాళి నాటికి ఇచ్చిన హామీలు మరొక పధకం అయిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని అమలు చేయనున్నామన్నారు. గత ప్రభుత్వం అన్యాయంగా అర్హులైన వారికి కూడా పెన్షన్ ఇవ్వలేదని, అటువంటి వారిని గుర్తించే వారి అర్హత మేరకు పెన్షన్లు అందించే కార్యక్రమాలు చేపడతామన్నారు. అదేవిధంగా 50 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వారి అర్హత మేరకు పెన్షన్ అందించడం జరుగుతుందన్నారు. ప్రజా ప్రయోజనాలు కోరుతూ ప్రభుత్వం అందించే పథకాలు ప్రజలకు తెలియజేసే విధంగా ఆరు రోజులు పాటు నగరంలో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కూడా జంతువులు నుంచి తీసిన కొవ్వు ను ఆవు నెయ్యిగా సృష్టించి గత ప్రభుత్వం కల్తీ నెయ్యి సప్లై చేయటం అనేది క్షమించరాని నేరమని, ఇందుకు దేవుడే వారికి శిక్షను విధించడం వలన 11 సీట్లకే పరిమితమయ్యారని పేర్కొన్నారు. ఈ 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలు ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. ప్రజలకు నిద్ర లేకుండా చేసిన “ల్యాండ్ టైటిలింగ్యాక్ట్”ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రతను కల్పిస్తామన్నారు. నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డీఎస్సీతో 16,437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని త్వరలో ప్రభుత్వం చేపడుతుందన్నారు. ప్రజల ఆకాంక్షలకు, అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆ దిశగా సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు.
మున్సిపల్ కమిషనర్ కాటన్ గార్గ్ మాట్లాడుతూ నగరంలో మూడు అన్న క్యాంటీన్ అవి విజయవంతంగా నడుస్తున్నాయని మరో రెండు అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. అదేవిధంగా కాలుష్య రహిత నగరం గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ప్రభుత్వం అందించే పథకాల్లో ప్రయోజనాలను లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ పి.ఎం.సత్యవేణి, ఎస్. ఈ జి సాంబశివరావు నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.