-ఓనం వేడుకల్లో తెలంగాణ మంత్రి సీతక్క
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
హైదరాబాద్ నగరం ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకుంటుందని, అందుకే వివిధ రాష్ర్టాలకు, ప్రాంతాలకు చెందినవారు ఇక్కడికి రావడానికి ఇష్టపడటమే కాకుండా వారి సొంత ప్రాంతంగా భావిస్తారని మంత్రి సీతక్క అన్నారు. శేరిలింగంపల్లి, నల్లగండ్ల మళయాళీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఓనం వేడుకలను నిర్వహించారు. 20 గెటెడ్ కమ్యూనిటీలకు చెందిన దాదాపు 800లకుపైగా ఉన్న మళయాలీ కుటుంబాలు తమ కుటుంబ సభ్యులతో కలిసి నల్లగండ్లలోని ఎపిస్టెమో స్కూల్‌లో నిర్వహించిన వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీక్కతోపాటు ప్రత్యేక అతిధిగా అన్విత గ్రూప్ సీఎండీ అచ్యుత రావు బొప్పన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన నగరమన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ సంస్కృతి సంప్రదాయాలను ఎంతో ఘనంగా జరుపుకుంటారన్నారు. ప్రభుత్వం సైతం ఎలాంటి భేషజాలకు పోకుండా ప్రతి ఒక్కరిని కడుపున పెట్టుకొని చూసుకుటుందన్నారు. ఈ కారణంగానే ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నగరానికి భారీ సంస్థలు పెట్టుబడి పెట్టడానికి, తమ వ్యాపారాలను విస్తరించడానికి ముందుకొస్తున్నాయన్నారు. అచ్యుతరావు బొప్పన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ పండుగ వచ్చినా అందరూ కలసి కట్టుగా చేసుకుంటారన్నారు. అంతా ఒక కుటుంబంలా ఉంటారన్నారు. ఇలాంటి అద్భుతమైన వేడుకలలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. వేడుకలో బాగంగా ఇక్కడ పుష్పాలంకరణ, గోషయాత్ర, కేరళ క్రీడలతో కూడిన ఓనంకలి, అరిటాకులతో నిర్వహించే సద్య, మళయాలీల సంస్కృతిక నృత్యమైన కథాకళి తదితర వేడుకలతో అందరిని ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో అన్విత గ్రూపు డైరెక్టర్ బొప్పన నాగ భూషణం తదితరులు పాల్గొన్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులను అందించారు.