Breaking News

ఎన్యుమరేషన్ చేయటం, వరద సాయం అందించటంలో ప్రభుత్వం ఘోర వైఫల్యం: మల్లాది విష్ణు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద బాధితులకు పరిహారం విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణమని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ఈ మేరకు ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. వరద బాధితులను ఈ ప్రభుత్వం నిండా ముంచిందని.. ముఖ్యంగా సర్వే వివరాలు పొంతన లేనివిధంగా ఉన్నాయని మండిపడ్డారు. 97 శాతం మందికి నగదు బదిలీ చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నా.. గ్రౌండ్ రిపోర్ట్ పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. ఎన్యుమరేషన్లో అవకతవకలు జరిగినట్లు ఆధారాలతో సహా అధికారులకు సమర్పించినా ఫలితం లేదన్నారు. టీడీపీ నేతలు సచివాలయాలలో కూర్చొని అర్హులను ఎంపిక చేయటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 22,185 మందికి నేటికీ కనీస సాయం అందలేదని చెప్పారు. పరిపాలన వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, అధికారులలో చిత్తశుద్ధి, పర్యవేక్షణ లోపించటంతో నెల రోజులు గడిచినా బాధితులు నానా ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. వరద హెచ్చరికలు జారీచేయటంతో పాటు బాధితులకు సాయం అందించటంలోనూ ఈ ప్రభుత్వం అట్టర్ ఫెయిల్ అయిందని ఆరోపించారు.

కేంద్రానికి రూ. 7 వేల కోట్ల నివేదిక పంపి.. చివరకు అరకొర సాయంగా రూ. 600 కోట్లు విదిల్చారని మల్లాది విష్ణు నిప్పులు చెరిగారు. అదే గత ప్రభుత్వంలో 2.71 లక్షల కోట్లు నగదు బదిలీలు జరిగినా.. ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది తలెత్తలేదని గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వం రూ. 600 కోట్లు అందించటంలో ఘోరంగా వైఫల్యం చెందిందని, ఫలితంగా బాధితులలో తీవ్ర గందరగోళం నెలకొందన్నారు. వెహికల్ క్లెయిమ్స్ పరిస్థితి మరీ దారుణంగా ఉందని.. రూపాయి నష్టానికి పది పైసలు కూడా అందటం లేదన్నారు. ప్రభుత్వ అశ్రద్ధ కారణంగా కార్మికలోకం కుదేలైందన్నారు. సచివాలయాలకు వెళ్ళి అనేక సార్లు దరఖాస్తు చేసుకుంటున్న.. చివరికి ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్ళి అర్జీలు అందజేసినా బాధితులకు న్యాయం జరగటంలేదన్నారు. ప్రభుత్వ సాయం అందలేదన్న ఆవేదనతో ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలచివేసిందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వమే ఉంటే తమకీ పరిస్థితి వచ్చేది కాదని బాధితులు స్వయంగా చెబుతున్నారని.. కానీ పరిహారం అందలేదని కలెక్టరేట్ వద్ద వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీలు, బాలింతలు చిన్న పిల్లలతో ఆందోళనకు దిగటం ఈ ప్రభుత్వ అసమర్ధతకు అద్దం పడుతోందన్నారు. గత ప్రభుత్వంలో పథకాల నుంచి పరిహారం వరకు ఇంటి వద్దే అందేవని.. కూటమి ప్రభుత్వం వచ్చాక మరలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే పరిస్థితులు నెలకొన్నాయని మల్లాది విష్ణు ఆరోపించారు. కనుక ఈ నెల 4 లోపు మరలా ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి.. నిధులు రాబట్టాలని ప్రభుత్వ పెద్దలకు సూచించారు. లేనిపక్షాన బాధితుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *