Breaking News

మచిలీపట్నం నుంచి నరసాపురం, రేపల్లెకు కొత్త రైల్వే లైన్లు… : ఎంపీ వల్లభనేని బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
నర్సాపురం నుంచి మచిలీపట్నం, మచిలీపట్నం నుంచి రేపల్లె వరకు కొత్త రైల్వే లైన్ లకు ప్రతిపాదనలు సిద్ధం చేసి సర్వే పనులు ప్రారంభించినట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన నగరంలోని స్థానిక రహదారులు భవనాల అతిథి గృహంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జిల్లా వాసుల చిరకాల వాంఛ, దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఋణం మంజూరు చేయించి పనులు వేగవంతం చేయిస్తున్నామని, అదే రీతిలో మచిలీపట్నం నుంచి రెండు కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మచిలీపట్నం నుంచి చిలకలపూడి, పల్లెపాలెం, బంటుమిల్లి, మాట్లం మీదుగా నర్సాపురం వరకు కొత్త రైల్వే లైన్ కోసం సర్వే చేపట్టామని తెలిపారు. గతంలో నర్సాపురం నుంచి మచిలీపట్నం రావాలంటే భీమవరం నుంచి గుడివాడకు చేరుకుని రావాల్సి వచ్చేదని, దాని ద్వారా ప్రయాణ సమయం ఎక్కువ అవుతుందని, ప్రస్తుతం ఈ కొత్త కోస్టల్ రైల్వే లైన్ వల్ల సమయం ఆదా అవుతుందన్నారు.

అదేవిధంగా మచిలీపట్నం నుంచి అవనిగడ్డ మీదుగా రేపల్లెకు సైతం కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు తొలి అడుగు పడిందన్నారు. వీటిపై రైల్వే అధికారులు ఇప్పటికే సర్వే పనులు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డిపిఆర్) తయారు చేస్తున్నట్లు తెలిపారు. సముద్ర తీర ప్రాంతాలను కలుపుతూ ఈ కొత్త రైల్వే లైన్లు ఏర్పాటు చేయడం ద్వారా హౌరా నుంచి చెన్నై వెళ్లే గూడ్స్, ఎక్స్ప్రెస్ రైళ్లు విజయవాడ జంక్షన్ మీదుగా కాకుండా నర్సాపురం మచిలీపట్నం రేపల్లె మీదుగా వెళ్ళటానికి అవకాశం ఉందని తద్వారా విజయవాడ జంక్షన్ వద్ద రద్దీ తగ్గుతుందన్నారు.

అదేవిధంగా రేపల్లె నుంచి బాపట్లకు లైన్ కలిపే విధంగా ప్రతిపాదించామని, తద్వారా చెన్నై, తిరుపతి ప్రాంతాలకు చేరుకునేందుకు సమయం ఆదావుతుందన్నారు. మచిలీపట్నం నుండి రేపల్లె రైల్వే లైన్ సాధించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన సర్వేలన్నీ పూర్తి చేయించడంతోపాటు రానున్న రైల్వే బడ్జెట్ లో నిధులు విడుదల చేయించి పనులు ప్రారంభించే విధంగా కృషి చేస్తానన్నారు. కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు ప్రతిపాదనలపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించి ఆర్డర్ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సహాయ సహకారాలు తీసుకొని ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్ళనున్నట్లు ఎంపీ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో కూటమి నాయకులు బండి రామకృష్ణ, వంపుగడల చౌదరి, మాదివాడ రాము తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *