-పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి
-ఏపిసిసి అధ్యక్షులు డా||సాకే శైలజానాథ్ డిమాండ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 7వ తేదీ నుండి 17వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు అఖిల భారత కాంగ్రెస్ కమిటి పిలుపునివ్వడం జరిగినది. రాష్ట్ర వ్యాప్త నిరసనలలో భాగంగా గురువారం నెల్లూరు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఏపిసిసి అధ్యక్షులు డా||సాకే శైలజానాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గాంధీ బొమ్మ సెంటర్ నందు వున్న పెట్రోల్ బంక్ నందు శైలజానాథ్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నిరసన తెలుపుతూ కొనుగోలుదారులతో సంతకాలు సేకరణ కార్యక్రమమలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రజల స్పందన వింటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాలు సేకరణలో పాల్గొని ప్రజలు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో పడుతున్న కష్టాలను తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం భారీగా వసూలు చేస్తోన్న సెంట్రల్ ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర ప్రభుత్వం అదనపు వ్యాట్ మరియు రోడ్ సెన్లు విధిస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో క్రూడాయిల్ ధరలను, ఇప్పుడు వున్న క్రూడాయిల్ ధరలను , అప్పుడు వున్న పెల్, డీజిల్, వంట గ్యాస్ ధరలతో ఇప్పుడు వున్న ధరలను పోల్చి చూపిస్తూ ప్రజల్లోకి వాస్తవాలను తీసుకువెళ్లారు. ఇప్పటికైనా ప్రజలు బిజెపి ప్రభుత్వ హయాంలో పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను గుర్తించాలని, 2024 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం ప్రజా శ్రేయస్సు కోసమే పనిచేస్తామని, కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆర్ధిక క్రమశిక్షణ తీసుకువస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజల సొమ్ముతో దుబారా ఖర్చులు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజలు గద్దె దించి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో శైలజానాథ్ తో పాటుగా నెల్లూరు జిల్లా అధ్యక్షులు చేవూరి దేవకుమార్ రెడ్డి, నగర అధ్యక్షులు ఉడతా వెంకటరావు, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుండి కూడా పెద్దఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసనలో పాల్గొనడం జరిగింది.