-చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ పట్టణ ఆర్థిక మరియు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పీలా గోవింద సత్యనారాయణ ఏపీయూఎఫ్ఐడిసి ఆఫీసులో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఏపీయూఎఫ్ఐడిసి ప్రధాన లక్ష్యం పట్టణ ప్రాంతాల్లో త్రాగు నీరు, పారిశుద్ధ్యం మరియు పార్కుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వివిధ పట్టణాభివృద్ధి పథకాల ద్వారా నిధులను సమీకరించి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్ లకు ఆ నిధులను అందించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం అమృత్ పథకం మరియు అర్బన్ వాటర్ సప్లై ఇతర మౌలిక సదుపాయాల కల్పన పథకాల కింద ఏపీయూఎఫ్ఐడిసి ప్రభుత్వ నిధులను దశలవారీగా ఆయా మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఈ పథకాల ప్రధాన ఉద్దేశం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పట్టణాలలో త్రాగు నీరు మరియు మెరుగైన పారిశుద్ద్య వసతులను కల్పించడమే లక్ష్యమన్నారు.
ఆయా పథకాలకు సంబంధించిన నిధులు సకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి మరియు ఇతర ఏజెన్సీల నుండి సమీకరించడంలో నా వంతు కృషి చేసి, అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా పాటుపడతానన్నారు. గౌరవ ముఖ్యమంత్రి ఆశయం ప్రతి ఇంటింటికి సురక్షితమైన మంచినీటిని సరఫరా చేయాలనే బృహత్తర కార్యక్రమంలో నా వంతు పాత్ర పోషించి పట్టణ ప్రజలందరికీ రక్షిత మంచినీటి సదుపాయం మరియు మెరుగైన జీవన విధానాన్ని కల్పించటానికి కృషి చేస్తానన్నారు.
తొలుత రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన నాయకులు, అభిమానుల మధ్య చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో సంస్థ ఎండీ హరినారాయణ, గాజువాక ఎమ్మెల్యే మరియు టీడీపీ అధ్యక్షులు పళ్లా శ్రీనివాసరావు, అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, హౌసింగ్ చైర్మన్ బత్తుల తాతయ్య చౌదరి, శాసనసభ్యులు బండారు సత్యన్నారాయణ మూర్తి, తదితరలు పాల్గొన్నారు..