Breaking News

పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేలా టూరిజం పాలసీ

-నవంబర్ లో విడుదలకి సన్నాహాలు..ఏప్రిల్ 2025 నుండి అమల్లోకి రానున్న పర్యాటక హిత పాలసీ
-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్
-పర్యాటకులను ఆకర్షించేలా, స్టేక్ హోల్డర్లకు అనుకూలంగా ఉండేలా పాలసీ రూపకల్పన
-ఏపీ పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సహకారం ఉంటుందని దక్షిణాది రాష్ట్రాల పర్యాటక మంత్రుల సదస్సులో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారని పేర్కొన్న మంత్రి దుర్గేష్
-పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించడం శుభపరిణామం
-పర్యాటకులను ఆకర్షించేలా టెంపుల్, ఎకో, అడ్వెంచర్, వెల్ నెస్, అగ్రి టూరిజంలను కలుపుతూ సర్క్యూట్ లు ఏర్పాటు
-రాష్ట్రంలో పీపీపీ విధానంలో 5 ప్రాంతాల్లో ఫైవ్ స్టార్ హోటళ్లు ఏర్పాటు చేయనున్న ఒబెరాయ్ సంస్థ
-రూ.500 కోట్లతో ఏపీకి మెగా ప్రాజెక్టు..అమరావతిలో గోల్ప్ కోర్స్ ఏర్పాటు.. రివర్ ఫ్రంట్ పొడవునా టూరిజం ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి
-సినిమాలు, లఘు చిత్రాల ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రాచుర్యం కల్పిస్తాం
-జనవరిలో విశాఖ ఉత్సవ్, బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తాం
-పర్యాటక అభివృద్ధి కోసం త్వరలో పెట్టుబడిదారులతో కాన్ క్లేవ్ నిర్వహించేందుకు సన్నాహాలు
-ముగిసిన మంత్రి కందుల దుర్గేష్ రెండు రోజుల విశాఖ పర్యటన

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేలా నవంబర్ లో టూరిజం పాలసీ విడుదల చేస్తామని, ఏప్రిల్ 2025 నుండి పాలసీ అమల్లోకి రానుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆదివారం సాయంత్రం విశాఖపట్నంలోని సర్క్యూట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి టూరిజం పాలసీకి సంబంధించి పలు అంశాలు వివరించారు. పర్యాటకులను ఆకర్షించేలా, స్టేక్ హోల్డర్లకు అనుకూలంగా ఉండేలా పాలసీ రూపకల్పనకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలతో పర్యాటకాభివృద్ధి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రత్యేక సహకారం అందించేందుకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముందుకు వచ్చారని తెలిపారు. సెప్టెంబర్ 2న బెంగుళూరులో జరిగిన దక్షిణాది రాష్ట్రాల పర్యాటక మంత్రుల సదస్సులో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. వైజాగ్ లో జరగాల్సిన సమావేశం భారీ వర్షాలు, వరదల వల్ల బెంగుళూరులో జరిగిందని పేర్కొన్నారు. ఏపీలో పర్యాటక అభివృద్ధికి అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని తాను వెల్లడించానని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రసాద్ ద్వారా టెంపుల్ టూరిజాన్ని, స్వదేశీ దర్శన్ ద్వారా ఎకో, అడ్వెంచర్ టూరిజం అభివృద్ధి చేయనున్నామని వెల్లడించారు. టెంపుల్ టూరిజంలో భాగంగా నంద్యాల జిల్లా శ్రీశైలం, బాపట్ల జిల్లా సూర్యలంక, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ అఖండ గోదావరి, నంద్యాల జిల్లా సంగమేశ్వరం పరిసర ప్రాంతాల్లో ఐకానిక్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. స్వదేశీ దర్శన్ లో భాగంగా విశాఖ సమీపంలోని లంబసింగి, బొర్రా గుహలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టులను పట్టాలెక్కించనున్నామన్నారు.

పర్యాటక రంగానికి పెద్దపీట.. పరిశ్రమ హోదా:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు పర్యాటక రంగ అభివృద్ధిపై దృష్టి పెట్టిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పర్యాటక శాఖ సమీక్షా సమావేశంలో సైతం రాష్ట్రంలో పర్యాటక రంగానికి పెద్దపీట వేయాలని సూచించారు. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించడం శుభపరిణామమని పేర్కొన్నారు. పర్యాటకులను ఆకర్షించాలన్న ఉద్దేశంతో హాస్పిటాలిటీ, హోటల్ యాజమాన్యాల కోరిక మేరకు రాత్రి వేళలో 11, 12 గంటల వరకు హోటళ్ల కార్యకలాపాలు నిర్వహించుకునేలా ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపిందన్నారు.

టూరిజం సర్క్యూట్ ల ఏర్పాటు చేసి, ఆహ్లాదకరమైన వాతావరణంలో రిసార్టులు, ఇతర వసతి సౌకర్యాలు, మౌలిక సదుపాయలు కల్పించి మూడు నాలుగు రోజులు పర్యాటక ప్రాంతంలో పర్యాటకులు ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా టెంపుల్ టూరిజం కోసం వచ్చే యాత్రికులే 90 శాతానికి పైగా ఉంటున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టెంపుల్ టూరిజంతో పాటు ఎకో, అడ్వెంచర్, వెల్ నెస్, అగ్రి టూరిజంలను కలుపుతూ సర్క్యూట్ లను అభివృద్ధి చేసి పర్యాటకులు ఎక్కువ రోజులు ఉండేలా ప్రణాళికలు తయారు చేస్తామన్నారు. ఈ క్రమంలో తిరుపతి, శ్రీశైలం, బాపట్ల, గోదావరి జిల్లాల్లో, వైజాగ్ తీరంలో సర్క్యూట్ లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. తద్వారా ఆదాయం పెంపుకు కృషి చేస్తామన్నారు.

టూరిజం పాలసీ ద్వారా పర్యాటక ప్రాంతాల్లో సరైన సదుపాయాల కల్పన, ముందుకు వచ్చే పెట్టుబడిదారులకు రాయితీలు, వారిని ఆకర్షించేలా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ అంతేగాక ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించినట్లు పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్ట్ నర్ షిప్ ద్వారా పర్యాటకం అభివృద్ధి చేయాలని భావిస్తున్నామన్నారు. ఇప్పటికే పీపీపీ విధానంలో భోగాపురం సమీపంలోని అన్నవరంలో ఫైవ్ స్టార్ హోటల్ ఏర్పాటు చేసేందుకు ఒబెరాయ్ సంస్థ ముందుకు వచ్చిందన్నారు. అదేవిధంగా తిరుపతి, రాజమహేంద్రవరం సమీపంలోని పిచ్చుకలంక తదితర 5 ప్రాంతాల్లో ఫైవ్ స్టార్ హోటళ్ల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారని పేర్కొన్నారు.

రూ.500 కోట్లతో ఏపీకి మెగా ప్రాజెక్టు:
రూ.500 కోట్లతో ఏపీలోని అమరావతిలో మెగా ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. దక్షిణ భారతదేశంలోనే నెంబర్ 1 గోల్ప్ కోర్స్ ఏపీలో ఏర్పాటు చేసేందుకు కృషి

రెండు రోజుల విశాఖ పర్యటనలో ఈస్ట్ పాయింట్ గోల్ప్ క్లబ్ ఆధ్వర్యంలో వైజాగ్ ఓపెన్ గోల్ప్ టోర్నమెంట్ కు హాజరయ్యానని, ప్రైజ్ ల ప్రదానం కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు. గతంలోనే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు వారికి గోల్ప్ కోర్స్ ఏర్పాటుకు దాదాపు 8 ఎకరాల స్థలం కేటాయించారన్న విషయం గుర్తుచేశారు. ఏపీలోనే కాదు దక్షిణ భారతదేశంలోనే నెంబర్ వన్ గోల్ప్ కోర్స్ గా తీర్చిదిద్దుతామని తెలిపామన్నారు. గోల్ప్ ను అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకంగా అభివృద్ధి చెందించాలన్నది తమ ఉద్దేశమని ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో పేర్కొన్నారని గుర్తు చేశారు. అమరావతిలో కూడా గోల్ప్ కోర్స్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. గోల్ప్ కోర్సుల విషయంలో ఇండియాలో 5వ స్థానంలో ఉన్నామని తెలిపారు. అదే విధంగా రాజధాని అమరావతిలో రివర్ ఫ్రంట్ పొడవునా పర్యాటక ప్రాజెక్టులు నెలకొల్పేందుకు సీఎం ఆమోదం తెలిపారన్నారు. త్వరలోనే కాన్ క్లేవ్ ఏర్పాటు చేసి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తామన్నారు.

గడిచిన ఐదేళ్లలో కుంటుపడిన పర్యాటక రంగం..దిద్దుబాటు చర్యలకు ఆదేశం
గత ప్రభుత్వ అనాలోచిత విధానాలు, అక్రమాల వల్ల పర్యాటక రంగం కుంటుపడిందని విమర్శించారు. గడిచిన ఐదేళ్లలో పర్యాటక మంత్రి చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ ను విమర్శించేందుకు తపన పడ్డారే తప్ప పర్యాటక ప్రాజెక్టులను వృద్ధి చేయాలన్న ఆలోచన చేయలేదన్నారు. యాత్రి నివాస్ ఆగస్ట్ 31 నాటికి ప్రజలకు అందుబాటులోకి రావాలని కానీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నత్తనడకన సాగుతోందన్నారు. ఈ క్రమంలో యాత్రినివాస్ కు మరిన్ని నిధులు సమకూర్చి అభివృద్ధిని వేగవంతం చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ విషయమై రేపు విజయవాడలో సమీక్ష నిర్వహించి త్వరగా వినియోగంలోకి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్, అటవీ శాఖ అనుమతులతో ఎంవీ మా షిప్ ను అందుబాటులోకి తెస్తామన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో చర్చించి, అటవీ శాఖతో సమన్వయం చేసుకొని జంగిల్ బెల్ ను వినియోగంలోకి తెస్తామన్నారు. సినిమల ద్వారా రాష్ట్ర పర్యాటకానికి ప్రాచుర్యం తీసుకురావాలని భావిస్తున్నామన్నారు. టూరిజం మీద లఘు చిత్రాల ద్వారా అవగాహన, ఆసక్తి కల్పిస్తామన్నారు. జనవరిలో విశాఖ ఉత్సవ్, బీచ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు చర్యలు చేపడతామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *