విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పెండింగ్ పనులపై డివిజన్ల వారీగా ఆరా తీశారు. పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలన్నారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురికాకుండా సైడ్ డ్రెయిన్ల పూడికతీత పనులు త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. అదేవిధంగా శంకుస్థాపనలు జరిపిన పనులలో జాప్యం తగదన్నారు. టెండర్లు పూర్తయిన పనులను వెంటనే చేపట్టాలన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్మాణ పర్యవేక్షణలో అధికారుల అలక్ష్యం వహించరాదని పేర్కొన్నారు. పనులలో జాప్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని, ప్రజాశ్రేయస్సు కొరకు ఏ సమయంలోనైనా తాను అందుబాటులో ఉంటానని తెలియజేశారు. అదేవిధంగా కౌన్సిల్ సమావేశానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో వీఎంసీ డీఈ గురునాథం, ఎలక్ట్రికల్ డీఈ ఫణి, వాటర్ సప్లై డీఈ రామకృష్ణ, ఏఈలు వెంకటేష్, శ్రీనివాస్, మౌసమి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్
-సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …