-పున్నమి ఘాట్, బబ్బూరి గ్రౌండ్స్ లో మూడ్రోజులపాటు నిర్వహించే నారీ శక్తి ఉత్సవంలో మొదటి రోజు కార్యక్రమం ప్రారంభం
-ఆధ్యాత్మికతను స్ఫురించేలా, మహిళా సాధికారతను స్పురించేలా సాంస్కృతికి కార్యక్రమాలు
-9 మంది మహిళలకు పసుపు కుంకుమలు అందజేత
-తొలిరోజులో భాగంగా ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పండుగలు ప్రజల జీవితాల్లో ఒక భాగమని దసరా పండుగ మాత్రం మహిళలకు ప్రత్యేకమని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. విజయవాడ పున్నమి ఘాట్, బబ్బూరి గ్రౌండ్ లో మూడు రోజులపాటు నిర్వహించే నారీ శక్తి విజయోత్సవాల్లో మొదటి రోజు నారా భువనేశ్వరి ముఖ్య అతిధిగా శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరితోపాటు దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మరియు మన సంస్కృతి, సాంప్రదాయాలను అందరికీ తెలియజేసేందుకు కనకదుర్గమ్మ చరణాల చెంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. పండుగలను మన తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారన్నారు. అంతేకాదు పండుగల నిర్వహణ అనేది మన సంస్కృతి, సాంప్రదాయాలను పాటించడమేనన్నారు. దసరా అంటే మహిళా శక్తికి నిదర్శనమని, స్త్రీ శక్తి గొప్పతనాన్ని తెలియజేస్తుందన్నారు. మహిషాసురుడి వధకు గుర్తుగా దసరా పండుగ నిర్వహిస్తున్నారని, దసరా అంటే అందరికీ గుర్తొచ్చే క్షేత్రం ఇంద్రకీలాద్రి అని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. మహిళల విజయాలు, వారి శక్తిని గుర్తించి అభినందించే, ప్రోత్సహించే గొప్ప కార్యక్రమం నారీశక్తి విజయోత్సవమన్నారు. మహిళలు అంతరిక్షానికి వెళ్లడమే కాదు యుద్ధ విమానాలు సైతం నడుపుతూ, శాస్త్రవేత్తలుగా కూడా రాణిస్తున్నారన్నారు. పంచాయతీ సర్పంచ్ నుంచి రాష్ట్రపతి పదవి వరకు మహిళలు తమ సేవలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారత్ కు గిరిజన మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఉండటం ప్రజలందరికీ గర్వకారణమన్నారు. కానీ ఇవి నాణేనికి ఒకవైపు మాత్రమేనని ఇప్పటికీ సమాజంలో మహిళలపై వివక్ష కొనసాగుతోందన్నారు. మహిళా సాధికారత తప్పనిసరిగా సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి మహిళా తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించినప్పుడే నిజమైన మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు.
దాదాపు నాలుగు శతాబ్ధాల క్రితమే మగవారితో సమానంగా ఆడవారికి ఆస్తిహక్కు కల్పించిన ఘనత దివంగత అన్న ఎన్.టీ రామారావు కే దక్కుతుందన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతో ఆడపడుచులు పెద్దఎత్తున రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేశారు. ఆడపిల్లల కోసం తిరుపతిలో తొలి మహిళా యూనివర్శిటీ ప్రారంభించారన్నారు. దివంగత ఎన్.టీ రామారావు స్ఫూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఉద్యోగాల్లో, కళాశాలల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను సీఎం చంద్రబాబు తీసుకొచ్చారన్నారు. మహిళలు వారి కాళ్లపై వారు నిలబడాలని డ్వాక్రా సంఘాలను ముందుకు తీసుకెళ్లారని గుర్తు చేశారు. ప్రతి ఆడపిల్ల చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రతి కిలోమీటర్ కు ఒక స్కూల్ ను నిర్మించారన్నారు. ప్రతి ఆడపిల్ల నేడు మగవారితో సమానంగా ఉద్యోగాలకు వెళ్తుంటే తనకు గర్వంగా ఉందన్నారు. తనకు హెరిటేజ్ బాధ్యత అప్పగించినప్పుడు నేను నిర్వహిస్తానో లేదో అనే సందేహం ఉందని, కాని నేను వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిలబడగలిగానన్నారు. సమాజంలో ప్రతి మహిళకు అనేక సవాళ్లు, అడ్డంకులు, కష్టాలు ఎదురవుతాయని ధైర్యంగా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లాలని అప్పుడే సక్సెస్ సాధించగలుగుతామన్నారు. కుటుంబం కోసం, పిల్లల కోసం శ్రమించే ప్రతి మహిళ తనకు ఆదర్శమన్నారు. చేనేత కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం చాలా ఉందని, వారంలో ఒక్కరోజైనా చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ ధరించాలన్నారు.
రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్. సవిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి మహిళ అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. మహిళా సాధికారతకు ఆనాడు దివంగత ఎన్టీఆర్ కృషిచేస్తే, ఆయన స్ఫూర్తిగా విజనరీ లీడర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. వరద విపత్తు సమయంలో కలెక్టరేట్‌లోనే పదిరోజులకుపైగా ఉండి పరిస్థితులు చక్కదిద్దేలా చేసేందుకు తోడ్పాటునందించిన సీఎం చంద్రబాబు వెనుక ఉన్న నారీ శక్తి, మానవతామూర్తి అమ్మ నారా భువనేశ్వరి అయితే, రాష్ట్ర ప్రజలకు అండగా నిలవాలని మంత్రి లోకేష్ వెనుక నిలబడ్డ నారా వారి కోడలు నారా బ్రాహ్మణి అని మంత్రి ప్రశంసించారు.
రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ స్త్రీని ఎలా గౌరవించాలని భావితరాలకు చెప్పే వేదికగా ఈ శక్తి విజయోత్సవం ఉండాలని ఆకాంక్షించారు. అమ్మ, అక్క, చెల్లి, ప్రతి ఆడపిల్లను గౌరవించుకోవాలనే తత్వం పిల్లలందరికీ ప్రతి తల్లి నేర్పించాలన్నారు. అప్పుడే అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలు తగ్గుతాయన్నారు. కృష్ణమ్మ సాక్షిగా, దుర్గమ్మ సాక్షిగా దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. స్త్రీ అంటేనే ఒక శక్తి అని ప్రతి రంగంలోనూ నేడు మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందనే మాటకు నిదర్శనం అమ్మ నారా భువనేశ్వరి అని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. కృష్ణమ్మ నది ఒడ్డున నారీ శక్తి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్న పర్యాటక శాఖకు అభినందనలు తెలిపారు. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చినవేళ పరిస్థితులను పది రోజుల్లోనే సాధారణ స్థితికి తెచ్చిన దార్శనికుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మాతృత్వం, వీరత్వం, దాతృత్వం వంటి నవరసాలను పోషించగలిగే ఏకైక ప్రాణి ఈ ప్రపంచంలో కేవలం స్త్రీ మాత్రమే అని కీర్తించారు. మానవజాతి మనుగడకు ప్రాణం పోసింది మగువ.. త్యాగంలో, అనురాగంలో తరగని పెన్నిధి మగువ అంటూ అభివర్ణించారు. స్వాతంత్రోద్యమ సమయంలో మొట్టమొదటగా కత్తిపట్టిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర్నుంచి నేటి చెడు మీద పోరాటం చేస్తున్న ప్రస్తుత ప్రజానిధుల వరకు మహిళా మణులు తమ సేవలందిస్తున్నారన్నారు. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతిగా.. ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి అన్నవిధంగా మహిళామూర్తులకు పురుషులందరూ దన్నుగా నిలవాలన్నారు. నారీ శక్తి విజయోత్సవం కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియగా, కార్యక్రమం ఏరకంగా ఉండాలని స్వరూప స్వభావాలను అందించిన శ్రీమతి నారా భువనేశ్వరికి ధన్యవాదాలు తెలియజేశారు. నారీ శక్తి విజయోత్సవం మహిళా లోకపు గెలుపు అన్నారు. గతంలో హరించబడ్డ మహిళా హక్కులను మా ప్రభుత్వంలో పునరుద్దరించామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తోందన్నారు. బేటీ బచావో బేటీ పడావో అన్నమాటను తూచా పాటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కూడా దుర్గమ్మ భక్తులన్నారు. ఈరోజు నారీ శక్తి విజయోత్సవం కార్యక్రమం నిర్వహించడం రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖకు లభించిన అదృష్టంగా భావిస్తున్నామన్నారు.
తొలిరోజు కార్యక్రమంలో భాగంగా కృష్ణా నది ఒడ్డున ఆహ్లాదరకరమైన వాతావరణంలో నవదుర్గలు ప్రతిబింబించేలా మహా హారతి, దసరా ఉత్సవాల చరిత్ర, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కనకదుర్గ అమ్మవారి చరిత్రను వివరించేలా ఇంద్రకీలాద్రి ప్రాశస్త్ర్యం, నవ అవతారాల వివరణ, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద నృత్యాలు, కోలాటం, డప్పు, తప్పెట గుళ్లు, తెలంగాణ బోనాలు వంటి కళా ప్రదర్శనలతో పాటు హస్తకళా ప్రదర్శనలు, అంతర్జాతీయ రుచులతో ఫుడ్ ఫెస్టివల్, బొమ్మల కొలువు తదితర కార్యక్రమాలు ప్రదర్శించారు.
నారీ శక్తి విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా విజయవాడలో వచ్చిన వరదల విపత్తులను ఎదుర్కొని ధైర్యంగా నిలదొక్కుకున్న 9 మంది మహిళా మణులను నారా భువనేశ్వరి స్వయంగా కుంకుమ బొట్టు పెట్టి పసుపు కుంకుమలు అందించారు… ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, న్యాయమూర్తుల సతీమణులు, వివిధ రంగాల నిపుణులు, టూరిజం ఎండీ అభిషిక్త్ కిషోర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన తదితరులు పాల్గొన్నారు.