మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పిఎం సూర్యఘర్ పథకం అమలులో వేగాన్ని పెంచి నిర్ణీత లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యుత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ‘పీఎం సూర్యఘర్ – బిజిలి ముఫ్తి యోజన’ పురోగతిపై జిల్లా లోని విద్యుత్ ఉద్యోగులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీఎం సూర్య ఘర్ పథకం పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే మంచి కార్యక్రమమని, దాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత అందరి పైన ఉన్నదని స్పష్టం చేశారు. ప్రజలందరికీ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయాలనే మంచి ఆలోచన తో 78,000 రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, ఈ చక్కని అవకాశం సద్వినియోగం చేసుకునేలా వినియోగదారులను ప్రోత్సాహించాలని విద్యుత్ ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. ఇందులో ఎనర్జీ అసిస్టెంట్లు కీలకపాత్ర పోషించాలని ఆదేశించారు.
జిల్లాలో 1200 మంది వినియోగదారులు పీఎం సూర్యఘర్ యోజన కింద నమోదు చేసుకోగా కేవలం 142 మంది వినియోగదారులకు మాత్రమే గ్రిడ్ తో అనుసంధానం చేయటం జరిగిందని, అందులో 102 మంది వినియోగదారులకు సబ్సిడీ అందజేయడం జరిగిందని విద్యుత్ అధికారులు కలెక్టర్ కు వివరించారు. గత రెండు నెలలుగా పథకం అమలులో పురోగతి ఆశాజనకంగా లేదని వేగం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ సూచించారు. విద్యుత్ సహాయకులు తగినంత శ్రద్ధ చూపాలని, దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇంటికి పోయి వారితో మాట్లాడి నిర్ణీత లక్ష్యాలను సాధించాల్సి ఉందన్నారు. ఇకపై రెండు మూడు రోజులకు ఒకసారి ఈ పధకం గురించి సమీక్ష చేస్తానని , ఎవరిని ఉపేక్షించేది లేదని, పురోగతి సాధించని వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
ఈ టెలి కాన్ఫరెన్స్లో కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల నోడల్ అధికారి భాస్కర్ రావు, కృష్ణాజిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ సత్యానందం, మచిలీపట్నం ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావు డీఈలు , విద్యుత్ సహాయకులు పాల్గొన్నారు.