కానూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలను గుర్తించి వారికి ఆధార కార్డులు, ఆర్ఫన్(అనాధ) సర్టిఫికెట్ల జారీకి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం ఆయన పెనమలూరు మండలం కానూరులోని జిల్లా మహిళాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో పిల్లల సంరక్షణ సంస్థలు, బాల్యవివాహాలు, పిల్లల లైంగిక వేధింపులు, బాల కార్మికులు, పిల్లల సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల సంరక్షణ సంస్థల్లో (చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్) రక్షణ పొందుతున్న పిల్లలందరూ చట్టం పరిధిలోకి రావాల్సిందేనని, దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. జువైనల్ జస్టిస్ చట్టం ప్రకారం నిర్వహిస్తూ పిల్లల సంరక్షణ సంస్థల్లో ఉంటున్న వారికి సరియైన సదుపాయాలు లేకుండా పిల్లలను ఉంచుకుంటూ, వారికి రక్షణ సంరక్షణ కల్పించకుండా ఉన్న ఆయా సంస్థల నుండి పిల్లలను తీసుకువచ్చి అన్ని వసతులు ఉన్న ఇతర పిల్లల సంరక్షణ సంస్థలకు తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
పిల్లల పోషణ స్థితిని సక్రమంగా పర్యవేక్షిస్తూ గృహ సందర్శనలు నిర్వహించాలని సిడిపిఓలు, సూపర్వైజర్లకు కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్ పీడీ ఎస్ సువర్ణ, సిడిపిఓలు సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.