-నవంబరు 18న సచివాయాల వద్ద ఇళ్ల లబ్దిదారులతో సామాహిక అర్జీలు సమర్పణ.
-ఉచిత ఇసుక విఫలం కావటానికి ఎమ్మెల్యేలే కారణం
-రాష్ట్రంలో అవినీతి పెరిగింది
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలకు భిన్నంగా కార్యాచరణ ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. స్థానిక దాసరి భవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండగా తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని, ట్రూఆప్ చార్జీల పేరుతో భారం వేయబోమని, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా మాట్లాడారని గుర్తు చేశారు. అధికారంలో చేపట్టిన తరువాత రూ.8,114 కోట్లు విద్యుత్ చార్జీల పేరుతో ప్రజలపై భారం మోపేందుకు సిద్ధం అయ్యాయరని మండిపడ్డారు. ఇప్పటికే ఒక్క యూనిట్ విద్యుత్‌కి రూ.1.03పైసలు ట్రూఅప్ చార్జీ ఉందని, మరలా ట్రూఅప్ అంటూ మరో రూ.1.27పైసలు భారం వేస్తున్నారని తెలిపారు. దీంతో గృహ వినియోగదారులు, పారిశ్రామిక వేత్తలు, వ్యవసాయదారులపై తీవ్రంగా విద్యుత్ చార్జీల భారం పడుతుందన్నారు. అలాగే వ్యవసాయ మోటార్లకి స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేయటానికి రూ.7వేల కోట్లు వ్యయం చేయనున్నట్లు చెప్పారు. ఈ భారం ప్రతి విద్యుత్ వినియోగదారునిపై పడుతుందన్నారు. హిందూజా కంపెనీకి రూ.1,234 కోట్లు ఏపీఈఆర్సీ అనుమతులు లేకుండానే దోచుపెడుతున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అదానీతో లాలూచీపడినట్లే చంద్రబాబు ప్రభుత్వం కూడా ఆ విధానాన్నే కొనసాగిస్తూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి లొంగిపోతుందని ధ్వజమెత్తారు. స్మార్ట్‌మీటర్ల గురించి ఏపీఈఆర్సీకి చెప్పకుండా అమలు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజలపై విద్యుత్ చార్జీల భారాన్ని మోపితే ఇతర వామపక్ష పార్టీలను కలుపుకుని సీపీఐ పోరాటం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రైతులకి అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేలు ఇస్తామని చేసిన వాగ్ధానాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని చెప్పటం సరికాదన్నారు. రైతులకి కొంత ఊరటనిచ్చే ఈ పధకమే ప్రభుత్వానికి భారం అవుతుందా? అని ప్రశ్నించారు. పంట నష్టపోయి ఇబ్బందుల్లో ఉన్న రైతులకి తక్షణం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వ్యవసాయశాఖా మంత్రి అచ్చెన్నాయుడులను కోరారు.
ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని, ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు పెంచుతామని వాగ్ధానం చేశారని చెప్పారు. దీన్ని కేవలం హామీగా కాకుండా ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 32 లక్షల మంది లబ్దిదారులను సమీకరించి నవంబరు 18వ తేదిన రాష్ట్రంలో అన్ని సచివాలయాల వద్ద సామూహికంగా అర్జీలు ఇవ్వనున్నట్లు చెప్పారు. నిర్మాణ సామాగ్రి ధరలు, కూలి రేట్లు పెరిగిన కారణంగా ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మోదీ ప్రభుత్వాన్ని చంద్రబాబు నిలదీయలేక పోతున్నారన్నారు. చంద్రబాబు హయాంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరిగితే చంద్రబాబు ఎన్ని మంచి పనులు చేసినా ప్రజలు నమ్మరని హెచ్చరించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు స్టీల్ ప్లాంట్ ముఖ ద్వారం వద్ద నిలబడి స్టీల్‌ప్లాంట్‌ని ప్రైవేటుపరం కానివ్వమని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ స్టీల్ ప్లాంట్ ఉన్న గాజువాక నియోజకవర్గంలోనే వచ్చిందన్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు కూటమిపై నమ్మకం పెట్టుకున్న కారణంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న పల్లా శ్రీనివాసరావు అక్కడ 95వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారని చెప్పారు.
ఉచిత ఇసుక విధానం విఫలం కావటానికి ఎమ్మెల్యేలే కారణం అన్నారు. గతంలో కంటే ఎక్కువ ధరతో ఇసుక కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని సందేహం వ్యక్తం చేశారు. అదే పద్ధతి లిక్కర్ విషయంలో జరుగుతుందన్నారు. తక్కువ ధరకు నాణ్యమైన మద్యం లభించటం లేదన్నారు. షాపులు పెట్టుకున్న వారు 20శాతం ప్రభుత్వానికి చెల్లించటం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు. అయితే ప్రజాప్రతినిధులు బెల్టు షాపులు పెట్టుకొండి, మాకు 20శాతం కమిషన్ ఇవ్వండి అంటూ డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. సీఐ, ఎస్ఐ పోస్టులకు వేలం పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రశ్నించే పార్టీగా చెప్పుకునే జనసేనకి చెందిన ఎమ్మెల్యే సీఐ పోస్టుకి రూ.46 లక్షలు వసూలు చేశారని చెప్పారు. ఇంత లంచం ఇచ్చిన వారు ఊర్లమీదపడి దందాలు చేయకుండా ఉంటారా? అని ప్రశ్నించారు. గెలిచిన ప్రజాప్రతినిధులు అంగళ్లు పెట్టి వసూళ్లకి పాల్పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లో రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిందన్నారు. మరో ఆరు నెలల తరువాత మరింత పెరుగుతుందన్నారు. ఇది ఇలాగే కొనసాగితే అవినీతిని నియంత్రించటం చంద్రబాబు వల్లకాదని, మోదీ దిగివచ్చినా సాధ్యం కాదన్నారు. ఈ అంశాలపై శుక్రవారం జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేయటం జరిగిందన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, నూతన ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జరుగుతున్న పరిణామాలపై చర్చించినట్లు చెప్పారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్, జి.ఈశ్వరయ్య, అక్కినేని వనజ పాల్గొన్నారు.