-ఉమ్మడి కృష్ణా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి అబ్దుల్ రబ్బానీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉర్దూ భాష అభివృద్ధి, సాహిత్యంతో పాటు వివిధ విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన వారికి ప్రదానం చేసే పురస్కారాలకు ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి కృష్ణా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి అబ్దుల్ రబ్బానీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ స్థాయి పురస్కారం, డాక్టర్ అబ్దుల్ హఖ్ ప్రాంతీయ స్థాయి పురస్కారంతో పాటు ఉర్దూ సాహితీవేత్తలు, స్కాలర్లు, కవులు, పాత్రికేయులు, విమర్శ, పరిశోధన, గద్య బోధన తదితరాల్లో సేవలందించిన ఆరుగురికి జీవితకాల సాఫల్య పురస్కారాలు అందించడం జరుగుతుందన్నారు. ఉర్దూ భాషాభివృద్ధికి కృషిచేసిన వారికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, ఉర్దూతో అత్యున్నత శ్రేణిలో రాణించిన విద్యార్థులకు ఉత్తమ విద్యార్థి పురస్కారాలను కూడా అందించడం జరుగుతుందన్నారు. స్వతంత్ర భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా సేవలందించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి నవంబర్ 11న (మైనారిటీల సంక్షేమ దినోత్సవం) అవార్డుల ప్రదానం ఉంటుందన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయస్థాయి పురస్కారం కింద రూ. 1,25,000తో పాటు సర్టిఫికెట్, మెమెంటోను డా. అబ్దుల్ హఖ్ ప్రాంతీయ పురస్కారం కింద రూ. లక్ష, సర్టిఫికెట్, మెమెంటోను ప్రదానం చేస్తారని తెలిపారు. ఉర్దూ అకాడమీ జారీచేసిన దరఖాస్తు ఫారం పూరించి ఉపాధ్యాయులు డీఈవో/డిప్యూటీ డీఈవో ద్వారా, ఇంటర్, డిగ్రీ కళాశాలల ఉపాధ్యాయులు ప్రిన్సిపల్, డీఈవీవో/ఆర్ఐవో ద్వారా, విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులు ప్రిన్సిపల్/రిజిస్ట్రార్ ద్వారా ప్రమాణ ప్రతులను జతచేసి పంపాలని వివరించారు. దరఖాస్తులను డా. మొహమ్మద్ మస్తాన్, డైరెక్టర్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉర్దూ అకాడమీ, డోర్ నెం. 76-1-6ఏ/ 1 & 2, మాలవిక విల్లా, హెచ్‌బీ కాలనీ, భవానీపురం, విజయవాడ, 520012 చిరునామాకు స్వయంగా లేదా పోస్ట్/కొరియర్ ద్వారా పంపించాలని సూచించారు.