-ఈనెల 13 నుండి 15వరకు పెరిగిన డయేరియా కేసులు
-గత నాలుగు రోజులుగా కేసుల నమోదులో భారీ తగ్గుదల
-శనివారం నాడు నమోదయ్యింది ఒక్క కేసు మాత్రమే
-డయేరియా వల్ల మరణించింది ఒక్కరే అని నివేదిక
-డయేరియా ప్రబలడానికి కారణాలు, అదుపుచేయడంపై సమగ్ర సర్వే
-తాగునీటి కాలుష్యమే వ్యాధి ప్రబలడానికి ప్రధాన కారణం
-వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సియస్ ఎం.టి.కృష్ణబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్య ఆరోగ్య శాఖ, స్థానిక వైద్య సిబ్బంది పటిష్టమైన చర్యలు తీసుకోవడం వల్ల విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా అదుపులోకొచ్చిందని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆయన వివరాలతో కూడిన సమాచారం అందించారు.
వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు డయేరియా ప్రబలిన వెంటనే పబ్లిక్
హెల్త్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతిని విజయనగరం జిల్లాకు హుటాహుటిన పంపించామనీ, అక్కడే ఉండి పరిస్థితిని ఆమె పర్యవేక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ ను విజయనగరం జిల్లాకు ఆదివారం నాడు పంపించామన్నారు. స్థానిక వైద్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, డయేరియా వ్యాప్తికి గల కారణాలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదికను అందజేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. తాగునీటి నమూనాలను ప్రయోగశాలకు పంపించగా, కలుషితమైనట్లు తేలిందని ఆయన తెలిపారు. ఆ ప్రాంతంలో ప్రజలు బహిరంగ మల విసర్జన చేయడం వల్ల భూగర్భ జలం కలుషితమయ్యిందని, నీటిని సరఫరా చేసే పైపులు డ్రైనేజీ వ్యవస్థలో ఉండడం వల్ల లీకేజీ వలన కూడా తాగునీరు కలుషితమయ్యిందని స్థానిక అధికారులు వివరించారు.
డీహైడ్రేషన్ బాగా ఉన్న డయేరియా కేసుల్ని చీపురుపల్లి సిహెచ్ సికి, విజయనగరం జిజిహెచ్, వైజాగ్ కేజిహెచ్ లకు తరలించారని, ఇంటింటికీ సర్వే చేసి అనుమానిత కేసుల్ని ఉచిత వైద్య శిబిరాలకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. పబ్లిక్ హెల్త్ స్పెషలిస్టు, ఎపిడిమాలజిస్ట్, మైక్రోబయాలజీ, కమ్యూనిటీ మెడిసిన్ నిపుణులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ఆప్రాంతంలో సమగ్ర సర్వే చేసి నివేదికను పంపించాలని కృష్ణబాబు ఆదేశించారు. నీరు కలుషితం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత ఖాధికారులకు సూచించారు. ప్రజలకు ట్యాంకర్ల ద్వారా సురక్షితమైన నీరు అందజేయబడుతున్నట్లు వివరించారు.
ఈనెల 13న ఒక కేసుతో డయేరియా కేసులు మొదలు కాగా, 14న 55 కేసులు, 15న 65 కేసులు నమోదయ్యాయి. 16న 40 కేసులు, 17న 32 కేసులు, 18న 8 కేసులు నమోదుతో కేసులు తగ్గుముఖం పట్టాయి. శనివారం నాడు ఒక్కకేసే నమోదయ్యింది. 53 మంది ప్రస్తుతం చికిత్స పొందుతుండగా, వీరిలో గుర్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో 17 మంది, వైజాగ్ కెజిహెచ్, జిజిహెచ్ విజయనగరం, ఘోషా ఆసుపత్రి, సిహెచ్‌సి చీపురుపల్లి లలో 36 మంది
చికిత్స పొందుతున్నారు.
ఇప్పటి వరకు గుర్లలో డయేరియా వ్యాధి వల్ల చనిపోయిన వారి సంఖ్య గురించి వివిధ రకాల వార్తలొస్తున్నాయని, కానీ వాస్తవంగా గుర్ల మండలంలో డయేరియా వలన ఒక్కరు మాత్రమే చనిపోయారని, ఏడుగురు పలు ఇతర వ్యాధులతో మరణించారని స్థానికంగా పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్న పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబుకు నివేదిక పంపారు.