-రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవిత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కడప జిల్లాలో పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో బలైన ఇంటర్ విద్యార్థిని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖ మంత్రి, కడప జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. తక్షణమే ఆర్థిక సాయం అందించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అదితి సింగ్ ను ఆదేశించామని మంత్రి వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 19న కడప జిల్లా గోపవరం మండలంలోని సెంచురీ ప్యానెల్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న అటవీప్రాంతంలో ఇంటర్ విద్యార్థినిపై విఘ్నేశ్ అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో విద్యార్థిని మృతి చెందిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్టు చేశామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడిపై విచారణ కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా…మృగాళ్లు భయపడేలా కఠిన శిక్ష విధిస్తామని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో బాధిత విద్యార్థిని కుటుంబానికి చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అండగా నిలవాలని నిర్ణయించిందన్నారు. రూ.5 లక్షల మేర ఎక్స్ గ్రేషియా ప్రకటించిందన్నారు. తక్షణమే బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ జేసీ అదితి సింగ్ ను ఆదేశించామని మంత్రి సవిత ఆ ప్రకటనలో తెలిపారు.