అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర పెట్టుబడులు, మౌలికసదుపాయాల శాఖ కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ మాట్లాడుతూ టెక్నాలజీ, ఆవిష్కరణల్లో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో అమరావతి డ్రోన్ సదస్సు ఓ మైలురాయని పేర్కొన్నారు. టెక్నాలజీ పరంగా మన భవిష్యత్తు రూపురేఖలు మార్చడంలో డ్రోన్లు కీలకపాత్ర పోషిస్తాయనడంలోఎలాంటి సందేహం లేదన్నారు. ప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా అందించడంలోనూ, విస్తరించడంలోనూ డ్రోన్ టెక్నాలజీ గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందన్నారు. డేటా అనలిటిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ తదితరాలతో పాటు డ్రోన్ టెక్నాలజీ దేశ వ్యాప్తంగా ప్రభుత్వాలు మరింత ప్రభావవంతంగా సేవలు అందించేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అమరావతి డ్రోన్ సదస్సు కేవలం ఓ ఈవెంట్ మాత్రమే కాదు.. మొత్తం డ్రోన్ కమ్యూనిటీని ఒకే వేదికపై తీసుకొచ్చే మంచి వేదికని అన్నారు. వ్యవసాయంతో పాటు మౌలిక వసతులు, విపత్తు నిర్వహణ ఇలా వివిధ రంగాల్లో డ్రోన్ టెక్నాలజీ ఉపయోగపడే తీరుతెన్నులపై నవ ఆవిష్కరణకు ఇది శ్రీకారంచుడుతుందన్నారు. గౌరవ దార్శనిక ముఖ్యమంత్రి నేతృత్వంలో ఓ మంచి సదస్సు నిర్వహణలో భాగస్వామ్యం అయినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
అమరావతి డ్రోన్ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రెండు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకుంది. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, తిరుపతి ఐఐటీతో ఈ అవగాహన ఒప్పందాలు చేసుకుంది. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో చేసుకున్న ఎంఓయూ వల్ల ఏపీకి డ్రోన్ రిమోట్ పైలట్ లైసెన్స్ సర్టిఫికేట్ జారీ చేసే అవకాశం కలుగుతుంది. అలాగే తిరుపతి ఐఐటీని నాలెడ్జ్ పార్టనర్‌గా చేసుకుంటూ మరో ఎంఓయూ కుదుర్చుకుంది. అదే విధంగా సమ్మిట్‌లో డ్రోన్ పాలసీ కాన్సెప్ట్ నోట్‌ను ఆవిష్కరించారు. సదస్సులో కేంద్ర పౌర విమానయాన శాఖ సెక్రటరీ ఉమ్లున్మంగ్ ఉల్నమ్, డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ స్మిత్ షా తదితరులు పాల్గొన్నారు.