-విశాఖ-విజయవాడ మధ్య ఎయిరిండియా..ఇండిగో విమాన సర్వీసులు
-వైజాగ్ ఎయిర్ పోర్టులో ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపి కేశినేని శివనాథ్
వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి రాజధాని ప్రాంతానికి విమాన సర్వీసుల కనెక్టివిటీ పెరిగితే వ్యాపారస్తులకి, ప్రజలకి మరింత సౌకర్యంగా వుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విమానయన రంగం అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక కేంద్రం నుంచి ప్రధాన మంత్రి మోదీ, పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అందుకు ఎంతో సహకరిస్తున్నారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు.
విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం విశాఖపట్నం- విజయవాడ మధ్య రెండు కొత్త విమాన సర్వీసులను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపి కేశినేని శివనాథ్ రన్ వే పై జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో ఒకటి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సర్వీసుకాగా.. మరొకటి ఇండిగో సర్వీసు. ముందుగా ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్రయాణీకులకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపి కేశినేని శివనాథ్ బోర్డింగ్ పాస్ లను అందజేశారు.
ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ అమరావతి- ఆర్థిక రాజధాని వైజాగ్ మధ్య అనుసంధానం మరింత పెంచడం ఎంతో ఆనందంగా వుందున్నారు. ఈ అనుసంధానం వల్ల ప్రజా రవాణా , రాష్ట్ర ఆర్ధిక ప్రగతి దొహదపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు..ఇప్పటి వరకు వైజాగ్ కి ఒక విమాన సర్వీసు మాత్రమే వుండగా, ఇప్పుడు మరో రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి రావటం ప్రయాణీకులకి ఎంతో సౌకర్యంగా వుంటుందన్నారు.
ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్.. ఉదయం 9.35 గంటలకు విశాఖపట్నంలో ప్రారంభమై, 10.35 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 7.55 గంటలకు బయలుదేరి, 21.00 గంటలకు విశాఖ చేరుతుంది.
అలాగే ఇండిగో సర్వీసు రోజూ రాత్రి 19.15 గంటలకు విజయవాడలో బయలుదేరి, 20.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 20.45 గంటలకు బయలుదేరి, 21.50 గంటలకు వైజాగ్ కు చేరుకుంటుందని తెలిపారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ భోగాపురంలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్ సర్వీసెస్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామన్నారు. 500 ఎకరాలలో ఏవియేషన్ సర్వీసులు, సౌకర్యాల కోసం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖ నుంచి ఎయిర్ కనెక్టివిటీ విస్తరణకు కృషి చేస్తున్నామని చెప్పారు. భోగాపురం విమానాశ్రయం బ్రైట్ స్పాట్‌గా మారుతుందన్నారు. వారణాసి, అయోధ్యకు విమాన సర్వీసుల ఇవ్వాలని ప్రతిపాదన ఉందన్నారు. విశాఖ నుంచి వీలైనన్ని కొత్త సర్వీసులు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. విజయవాడ – విశాఖ మధ్య రెండు నూతన సర్వీసులు అందుబాటులోకి రావడంతో టిక్కెట్ ధరలు తగ్గుతాయన్నారు.
ఈ కార్యక్రమం లో విశాఖపట్నం పశ్చిమ శాసనసభ్యులు పి.జి.వి.ఆర్ నాయుడు (గణబాబు) తో పాటు ఎయిర్ పోర్ట్ అథారిటీ నాయకులు పాల్గొన్నారు.