Breaking News

దేవాలయాలకు నెయ్యి సరఫరా పై ఉన్నత స్థాయి కమిటీ

-దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని దేవాలయాల్లో ప్రసాదాల తయారీ, ఇతరత్రా అవసరాల కోసం వినియోగించే నెయ్యి ని సేకరించే విషయంలో అనుసరించాల్సిన విధి విధానాల్లో మార్పులను సూచించడానికి ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటిని నియమిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. ఈ కమిటీ పదిహేను రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని మంత్రి నిర్దేశించారు. రాష్ట్రంలో దేవాలయాలకు నెయ్యి సరఫరా తీరు తెన్నులపై వివిధ డెయిరీ సంఘాలు, సంస్థల ప్రతినిధులతో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం నాడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని దేవాలయాల్లో వివిధ అవసరాల నిమిత్తం ఏటా సుమారు 1500 టన్నుల ఆవు నెయ్యి అవసరమని, దీనిని పూర్తి నాణ్యతా ప్రమాణాలతో, సకాలంలో, నిర్దేశిత పరిమాణంలో (క్వాంటిటీ) లో సేకరించేలా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న డెయిరీల్లో ఆవునెయ్యి ఉత్పాదన సామర్ధ్యం ఎంత ఉన్నది, దేవాలయాలకు ప్రస్తుతం ఎన్ని డెయిరీలు సరఫరా చేస్తున్నాయి, నెయ్యి సేకరణ విధానం తదితర అంశాలపై అధికారులు, డెయిరీల ప్రతినిధుల నుంచి సమాచారాన్ని తెలుసుకున్నారు. ఒక కేజి ఆవునెయ్యి ఉత్పత్తికి, సుమారు 25 లీటర్ల పాలు అవసరమన్న విషయాన్ని వారు మంత్రికి వివరించారు.

దేవాలయాలు డెయిరీల నుంచి నేరుగా నెయ్యిని సేకరించే విధానం అమలులో ఉండగా 2022 లో దీనిని మార్చి, టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారని, టెండర్లలోని షరతులు, నిబంధనలు మొదలైనవాటి కారణంగా పలు డెయిరీలు సరఫరాకు వెనకడుగు వేశారని ఈ సందర్భంగా అధికారులు, ప్రతినిధులు మంత్రి దృష్టికి తెచ్చారు. సుమారు రెండు గంటల పాటు సమావేశంలో పాల్గొన్న వారి అభిప్రాయలను, సమస్యలను తెలుసుకున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నెయ్యి సరఫరా విషయంలో సమగ్రమైన విధానాన్ని రూపొందించేందుకు సీనియర్ అధికారులు, డెయిరీల ప్రతినిధులు, ఎస్వీ డెయిరీ కళాశాల ప్రతినిధులు, ఇతర నిపుణులతో తదితరులతో ఒక ఉన్నతస్థాయి కమిటినీ నియమించి నివేదిక తెప్పించాలని దేవాదాయ శాఖ కమిషనర్ ను ఆదేశించారు. ఈ కమిటీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని పరిస్థితులను అధ్యయనం చేయాలని, అవసరమైతే ఆ ప్రాంతాల్లో పర్యటించి సమగ్రంగా నివేదిక రూపొందించేలా మార్గదర్శకాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పాడి సంపద, పాల ఉత్పత్తి , నిత్యావసరాలకు పాల వినియోగం కాకుండా, నెయ్యి ఉత్పత్తికి అవసరమైన పాల లభ్యత, ఏయే ప్రాంతంలో గో సంపద ఎక్కువగా ఉన్నది తదితర విషయాలన్నిటిపై ఈ కమిటీ అధ్యయనం చేయాలన్నారు
దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్. సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంగం డెయిరీ ఛైర్మన్, పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర మాట్లాడుతూ దేవాలయాలకు అవసరమైన నెయ్యిని స్థానికంగా ఉన్న డెయిరీల నుంచే (రాష్ట్రంలోని ఉత్పత్తి దారుల నుంచే) సేకరించాలని, వివిధ యూనియన్లు డెయిరీల మధ్య సహజంగా ఉండే పోటీని కూడా దృష్టిలో ఉంచుకుని నెయ్యి సేకరణ విధాన రూపకల్పనలో అన్ని డెయిరీలకు సమాన అకాశాలు లభించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *