మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకునే విధానంలో లోటుపాట్లపై లోతుగా అధ్యయనం చేసి ఆటో వాలాలకు ఎంతవరకు ప్రయోజనకరము పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. డీజిల్ ఆటోలను ఈ వి వాహనాలుగా కన్వర్ట్ చేయడానికి అయ్యే వ్యయం వ్యయం, ప్రయోజనాలు తదితర అంశాలపై చెన్నై నుండి వచ్చిన కంపెనీ ప్రతినిధులు బుధవారం కలెక్టరేట్లో వారి ఆటోలను ప్రదర్శించి జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ రవాణా అధికారులకు వివరించారు.
ప్రస్తుతం పాత ఆటో డీజిల్ వాహనాలను విద్యుత్ వాహనాలుగా కన్వర్ట్ చేయడానికి అయ్యే వ్యయం, ఈ అదనపు వ్యయం బ్యాంకుల ద్వారా లబ్ధిదారులకు రుణాలుగా అందించడం, కన్వర్ట్ అయిన ఈ వి వాహనాలు మైలేజీ ప్రయోజనకరమైనదా, అవసరమైన చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అవకాశాలు తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. సాధారణంగా విద్యుత్తు వాహనాలు వల్ల తక్కువ వ్యయంతో ఎక్కువ మైలేజ్ వచ్చే అవకాశం ఉందని, విధానం సక్సెస్ అయితే ఆటోవాలాలకు తగిన అవగాహన కల్పించడం ద్వారా వారి జీవనోపాధి మెరుగు పరచడానికి వీలవుతుందన్నారు. జిల్లా రవాణా అధికారి జి మనీషా, మోటార్ వాహన ఇన్స్పెక్టర్లు టివిఎన్ సుబ్బారావు, సిద్ధిక్, బి ఎస్ ఎస్ నాయక్, సోనీ ప్రియా, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.