– ముఖ్యమంత్రి ఆశయ సాధనకు అనుగుణంగా పనుల మంజూరు.
– ఎన్టీఆర్ జిల్లాలో తొలి దశలో రూ. 7.71 కోట్లతో 54 పనులు మంజూరు.
– డిసెంబర్ 31లోగా పూర్తి చేసేందుకు చర్యలు.
– జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ను గుంతల రహిత రహదారుల రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే మహా సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించారని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా, విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తెలిపారు. శనివారం విజయవాడ, ఆటోనగర్ లో జీఎన్టీ రోడ్డు నుంచి వీఎం రోడ్డు వయా ఆటో నగర్ రోడ్డులో ఆంజనేయ స్వామి ఆలయం వద్ద జిల్లా రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో రూ. 10 లక్షల అంచనా తో చేపట్టిన మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఏపీ కార్యక్రమం పనులను ఇంచార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిధి మీనా మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 1309 కిలోమీటర్ల పొడవైన రహదారులు ఉన్నాయని.. ఇందులో 876 కిలోమీటర్ల మేజర్ జిల్లా రహదారులు ఉన్నట్లు తెలిపారు. గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా తొలిదశలో జిల్లాలో రూ. 7.71 కోట్లతో 54 పనులు మంజూరు చేయడం జరిగిందని.. 352 కిలోమీటర్ల పరిధిలో పనులు జరగనున్నట్లు తెలిపారు. మైలవరం నియోజకవర్గంలో 14, తిరువూరు నియోజకవర్గంలో 12, జగ్గయ్యపేట నియోజకవర్గంలో 8, నందిగామ నియోజకవర్గంలో 13, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మూడు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రెండు, విజయవాడ మధ్య నియోజకవర్గంలో రెండు పనులు చేపట్టనున్నట్లు వివరించారు.
డిసెంబర్ 31 నాటికి పనుల పూర్తి.. శాసనసభ్యులు గద్దె రామ్మోహన్
ప్రజల జీవితాల్లో రహదారులు అనేవి చాలా కీలకమైనవి అని.. గుంతలు లేని రహదారుల కోసం గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినట్లు విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ అన్నారు. గత ఐదేళ్ల కాలంలో రహదారులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. చాలా ముఖ్యమైన రహదారులు సైతం నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గుంతలు లేని రహదారులు కార్యక్రమం కింద ప్రారంభించిన పనులను డిసెంబర్ 31 లోగా పూర్తి చేసేందుకు పటిష్ట ప్రణాళికతో పనిచేస్తున్నట్లు తెలిపారు. దాదాపు లక్ష మంది కార్మికులు పనిచేసే ఆటో నగర్ లో కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఎక్కడ చిన్న గుంత కనిపించినా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యత వహించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారని దీన్ని బట్టి కార్యక్రమానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలోనూ ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని శాసన సభ్యులు గద్దె రామ్మోహన్ తెలిపారు.
కార్యక్రమంలో విజయవాడ ఆర్డీవో కె.చైతన్య, ఆర్ అండ్ బి ఎస్ఈ టి.సత్యనారాయణ, ఈఈ ఎన్. కృష్ణ నాయక్, డీఈఈ శశిభూషణ్, 4బీ కన్స్ట్రక్షన్ గుత్తేదారు తుమ్మల జగదీష్, ఐలా మాజీ చైర్మన్ సుంకర దుర్గాప్రసాద్, స్థానిక నేతలు గొల్లపూడి నాగేశ్వరరావు, కె.ఆంజనేయ వాసు, జాస్తి సురేష్ తదితరులు పాల్గొన్నారు.