-మృతి చెందిన మహిళ కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చిన మంత్రి దుర్గేష్
-అరెస్ట్ అయిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించిన మంత్రి దుర్గేష్
-త్వరితగతిన కేసును పరిష్కరించిన పోలీసులను అభినందించిన మంత్రి కందుల దుర్గేష్
-గంజాయి మత్తులో యువత నిర్వీర్యం అయిపోతుందని, గంజాయి పై ఉక్కు పాదం మోపాలని పోలీసులను ఆదేశించిన మంత్రి దుర్గేష్
రాజమహేంద్రవరం (కడియం), నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రీ రూరల్ కడియంలోని ఓ నర్సరీలో పనిచేస్తున్న వివాహిత మహిళపై గంజాయి మత్తులో కొందరు యువకులు అత్యాచారం చేయడం శోచనీయమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కడియం మండలం బూరిలంక గ్రామంలో మృతి చెందిన మహిళ కుటుంబాన్ని మంత్రి దుర్గేష్ పరామర్శించారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. కుటుంబానికి రక్షణగా ఉంటామని హమీ ఇవ్వడం జరిగింది. మహిళ మృతికి కారణమైన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి దుర్గేష్ డిఎస్పీ భవ్య కిషోర్ ను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ బతుకుదెరువుకోసం పొట్ట చేతపట్టుకుని వచ్చిన అమాయకురాలిని కొందరు దుర్మార్గులు దారుణంగా హత్యాచారం చేసి హతమార్చడం క్షమించరాని నేరం అన్నారు. ఉపాధి కోసం వచ్చిన మహిళ కుటుంబం కొంతకాలంగా తూర్పుగోదావరి జిల్లా కడియంలో నివాసం ఉంటోందని ఈ ఘటనతో ఆ కుటుంబం రోడ్డున పడిందని మంత్రి పేర్కొన్నారు.స్థానిక శాసనసభ్యులు, ఎమ్మార్వో, ఎంపీడీవో, ఇతర అధికారులు, స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి త్వరితగతిన నిందితులను పట్టుకోవడం అభినందనీయమన్నారు. ఈ తరహా ఘటనలు సభ్య సమాజం తలదించుకునేవన్నారు.. ప్రశాంతమైన కడియం నర్సరీ ప్రాంతంలో ఇలాంటి దుర్ఘటనలు జరగడం బాధాకరమని మంత్రి దుర్గేష్ అన్నారు.
గత ప్రభుత్వంలో గంజాయి మత్తులో చెలరేగిన అవశేషాలు మిగిలిపోయిన అనడానికి ఈ ఘటన నిదర్శనం అన్నారు.. గంజాయి సాగు మీద వాడకం మీద ఉక్కు పాదం మోపాలని పోలీసులకు సూచించారు.. గంజాయి మూలాలను పూర్తిగా నిర్మూలించాలని, ఆకృత్యాలు అరికట్టాలని పోలీసులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు నిరంతరం నిఘా ఉంచాలని మంత్రి సూచించారు. గంజాయి మాదకద్రవ్యాలు అరికట్టేందుకు దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. మద్యం తాగారని గుర్తించేందుకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేసినట్టుగా, గంజాయి స్వీకరించిన వారిని గుర్తించేలా పరీక్షలు స్పాట్లో చేయాలన్నారు. కఠినమైన శిక్షలు అమలు చేసి గంజాయి వాడకాన్ని పూర్తిగా అరికట్టాలన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంత్రి వెంట డిఎస్పీ భవ్య కిషోర్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.