కృష్ణాజిల్లా అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్స్, బీమా వైద్య సేవలు శాఖ మంత్రి మరియు కృష్ణాజిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. జిల్లాలో వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలపై ఇంచార్జ్ మంత్రి సోమవారం స్థానిక జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, బందరు పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణ ప్రసాద్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఇన్చార్జి మంత్రి పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, ఉపాధి హామీ, ఇరిగేషన్ ఆర్డబ్ల్యూఎస్, బందరు పోర్ట్, ఫిషింగ్ హార్బర్ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోనప్పటికీ, ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రి ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి విజన్ తో నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పన లక్ష్యంగా రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేయడంతో పాటు, ఐటీ సెక్టర్ని అభివృద్ధి చేసి ఉపాధి ఉద్యోగ మార్గాలు కల్పించడం ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు అదే విధంగా కృష్ణా జిల్లాలో మల్లవల్లి పారిశ్రామిక వాడను మోడల్ ఇండస్ట్రియల్ కారీడారుగా 1122 ఎకరాల్లో అభివృద్ధి చేయడం లక్ష్యమన్నారు. కృష్ణా జిల్లాలో అన్ని రోడ్లను గుంతలు లేని రహదారులుగా అభివృద్ధి చేసేందుకు రు.14.76 కోట్లతో 239 కి.మీ. పొడవైన 45 రోడ్లు డిసెంబర్ లోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులు మచిలీపట్నం పోర్ట్, ఫిషింగ్ హార్బర్ పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసుకునేలా ప్లాన్ చేసుకోవాలని, నెల రోజుల్లో మరోసారి రోజంతా అన్ని శాఖలు సమీక్షిస్తామన్నారు.

రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ప్రజలు 94% మాండేట్ ఇచ్చారని సుపరిపాలన గుడ్ గవర్నెన్స్ అందించాలని ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు ప్రతి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెట్టించేందుకు ప్రతి జిల్లాకు ఇన్చార్జి మంత్రిని నియమించి వివిధ జిల్లాలలో అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈరోజు కృష్ణాజిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై ఇన్చార్జి మంత్రివర్యులు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. బందరు పోర్టు మన అందరి లక్ష్యం అన్నారు. తాళ్లపాలెం వద్ద బ్రిడ్జి నిర్మించినప్పటికీ అప్రోచ్ లేక నిరుపయోగంగా ఉందని అందుబాటులోకి తేవాలన్నారు. మండలంలో 34 పంచాయతీల్లో జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి తాగునీటి పంపులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఐదేళ్లలో చేయాల్సిన పనులు ప్రతి ఏడాది ప్రాధాన్యత క్రమంలో చేపట్టుటకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.

బందరు పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ ఇరిగేషన్, డ్రైనేజీ, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ ఈ నాలుగు శాఖల అధికారులు, శాసనసభ్యులతో చర్చించి, ఆయా నియోజకవర్గాలలో చేపట్టవలసిన అభివృద్ధి పనులు ప్రాధాన్యత క్రమంలో చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టరు అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్ ద్వారా చేపట్టే పనులు సమీక్షలో కేంద్ర రాష్ట్ర నిధుల లభ్యతను బట్టి కొన్ని పనులు నాబార్డులో కూడా పెట్టాలని సూచించారు. గత ఐదేళ్లలో రైతులు తాము పండించిన పంట ఇంటికి తేవడానికి డొంక రోడ్లు సరిగా లేక ఇబ్బందులు పడ్డారని, డొంక రోడ్లు అభివృద్ధి చేయుటకు ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం కారణంగా కృష్ణ వరద ప్రభావం ఎక్కువగా ఉందని, 12 లక్షల క్యూసెక్కుల వరద తట్టుకునే విధంగా కరకట్ట బలోపేతం చేయాలని, వచ్చే ఏడాది ఇలాంటి పరిస్థితి ఏర్పడకుండా ముందస్తు ప్రణాళికలతో డ్రైనేజీ వ్యవస్థ ఆధునికరించాలన్నారు.

జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వివిధ శాఖల అభివృద్ధి పై పిపిటి ప్రజెంట్ చేశారు. ఈ సమావేశం మినిట్స్ రికార్డు చేసి ఆయా శాఖలు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మంగళవారం అన్ని శాఖల ఇంజనీరింగ్ విభాగాలతో సమావేశం నిర్వహించి సమీక్షిస్తున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో ఇన్చార్జి డిఆర్ఓ శ్రీదేవి, జెడ్పి సీఈవో కన్నమ నాయుడు, వివిధ శాఖల అధికారులు, ఆర్డీవోలు పాల్గొన్నారు

Check Also

గవర కార్పొరేషన్‌ చైర్మన్‌గా మల్ల సురేంద్ర ప్రమాణ స్వీకారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర కార్పొరేషన్‌ చైర్మన్‌గా మల్ల సురేంద్ర ప్రమాణ స్వీకారం చేశారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *