Breaking News

మైలవరంలో విద్యుత్ ఉపకేంద్రాన్ని వర్చువల్ గా ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

– విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణంతో నాణ్యమైన, నిరంతర విద్యుత్తు సరఫరా సాధ్యం.
– శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్.
– కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఇంచార్జి కలెక్టర్ నిధి మీనా, విజయవాడ ఆర్డీవో సిహెచ్. చైతన్య.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మైలవరం, జి.కొండూరు పట్టణ గ్రామ ప్రాంత విద్యుత్తు వినియోగదారులకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తు అందించాలనే లక్ష్యంతో విద్యుత్ ఉపకేంద్రాన్ని నిర్మించినట్లు శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. టాన్స్ మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మైలవరంలో రూ. 20.78 కోట్ల నిర్మించిన 132/33 కె.వి. విద్యుత్ ఉప కేంద్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గురువారం సీఆర్డీఏ పరిధిలోని తాళ్లాయపాలెం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. మైలవరం విద్యుత్ ఉపకేంద్రం వద్ద ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి కలెక్టర్ నిధి మీనా, శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ , ఆర్డీవో సిహెచ్. చైతన్య, ట్రాన్స్ కో అధికారులు పాల్గొన్నారు. అనంతరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మైలవరంలో నిర్మించిన 132/33 కె.వి విద్యుత్తు ఉప కేంద్రాన్ని 2019లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే రూ.25 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు ప్రారంభించి 80 శాతం పనులు పూర్తి కావడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం మిగిలిన పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. తిరిగి తమ ఎన్డీఏ మహాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సబ్ స్టేషన్ పనులను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావడం సంతోషదాయకమన్నారు. ఈ ఉపకేంద్రం ఏర్పాటుతో మైలవరం, జి.కొండూరు మండలాల్లో నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరాకు అవకాశం కలిగిందన్నారు. మైలవరం పరిసర ప్రాంతాల ప్రజల అవసరాలకు అనుగుణంగా ముందుచూపుతో ఇక్కడ సబ్ స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటుతో లో-ఓల్టేజీ, బ్రేక్ డౌన్ స‌మస్యకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. తద్వారా నాణ్యమైన విద్యుత్ ను రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరాకు వీలు కలిగిందని శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో తహశీల్ధార్ బాలకృష్ణ రెడ్డి, సర్పంచ్ జి. మంజుభార్గవి, ట్రాన్స్ కో ఎస్ఇ ఎ. మురళి మోహన్, ఎంపీపీ ఐ. ప్రసన్న రాణి, డిఇఇ వసంతరావు, ఏడీఇ సుధాకర్, ఎఇ రమేష్, సబ్ ఇంజనీర్ నటరాజ్, స్థానిక నాయకులు అక్కల రామ్మోహనరావు (గాంధీ), నూతులపాటి బాల కోటేశ్వరరావు, ట్రాన్స్ కో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఎన్డీయే విధానం

-నాకు అధికారం, సీఎం కుర్చీ కొత్తకాదు… ప్రజలు నమ్మకంతో గెలిపించారు -వాట్సాప్ ద్వారా త్వరలో 150 సేవలు అందుబాటులోకి -వాట్సాప్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *