విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో సంక్రాంతి నాటికి గుంతల రహిత రహదారులుగా రాష్ట్రాన్ని మార్చాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా అధికారులు మరమ్మత్తుల పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆదేశించారు. నేడు విజయవాడలోని ఆర్ & బీ శాఖ ఈ ఎన్ సీ కార్యాలయంలో మంత్రి ఆధ్వర్యంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోడ్ల మరమ్మత్తులకు సంబంధించి సకాలంలో పనులు పూర్తి చేయడానికి ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే రోడ్ల మరమ్మతులకు సంబంధించి రోజువారి ప్రగతిని ఎప్పటికప్పుడు అందజేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. రోడ్ల మరమ్మత్తుల పనులకు సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని, కాబట్టి అధికారులు అందుకు అనుగుణంగా పనిచేయాలన్నారు. రోడ్ల మరమ్మతులకు సంబంధించి చేసిన పనులు నాణ్యతలో రాజీ పడకుండా చూడాలన్నారు. అలాగే మరమ్మత్తుల పనులు చేయడానికి ముందుకు రాని కాంట్రాక్టర్లపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పుడు పూడ్చిన గుంతలు వర్షాకాలం వచ్చేవరకు పాడై పోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్ & బీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, ఈ ఎన్ సీ నయిముల్లా, ఎస్ హెచ్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.