-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వేదాధ్యయనం పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న పండితులకు భృతిని కనీసం రూ. 10వేలు అందించాలని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వీరికి నిరుద్యోగ భృతి 3 వేల రూపాయలు ప్రకటించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతదేశం వేద భూమి అని.. అటువంటి చోట వేద విద్యను అభ్యసించిన పండితులను గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కనుక ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులలో నిరుద్యోగ భృతి పదాన్ని సంభావనగా మార్చాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలో ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి వేద పారాయణ సభ్యులైన 1,150 మంది ఘనాపాటిలకు రూ. 16 నుంచి రూ. 22 వేలు., క్రమాపాటిలకు రూ. 17 నుంచి రూ. 23 వేల వరకు సంభావనను పెంచినట్లు ఈ సందర్భంగా మల్లాది విష్ణు గుర్తుచేశారు. అలాగే టీటీడీలో ఖాళీగా ఉన్న 700 పోస్టులను వేద పారాయణ పథకం కింద భర్తీకి పూనుకోగా.. అధికారుల అలసత్వం కారణంగా నాడు కార్యరూపం దాల్చలేకపోయిందన్నారు. కనుక ప్రభుత్వం తక్షణమే ఆ ఖాళీలను నిరుద్యోగులుగా ఉన్న వేద పండితులతో భర్తీ చేయాలని సూచించారు. అప్పటివరకు కనీస భృతి రూ. 10 వేలు అందించవలసిందిగా కోరారు.