-సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టేవారిపై ఉక్కుపాదం
-గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి
-ఇటీవల 25వేల కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులకు హోమంత్రి ప్రశంసలు
-నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం అవసరం
-డీజీపీ కార్యాలయం,జిల్లాల పోలీస్ స్టేషన్లలో సోషల్ మీడియా సెల్ ఏర్పాటుకు అడుగులు
-ప్రత్యేక టాస్క్ ఫోర్స్ లు, కోర్టుల ద్వారా బాధితులకు త్వరగా న్యాయం
-సోషల్ మీడియాలో అశ్లీల పోస్టులతో పేట్రేగిపోతే అరెస్ట్ లు తప్పవు
-బాధితులు, కుటుంబాలకు ధైర్యమిచ్చేలా కఠిన చర్యలకు హోంమంత్రి ఆదేశం
-జిల్లాలలో ప్రజలను సీసీల పరిధిలోకి తెచ్చేలా డ్రైవ్ లు నిర్వహించాలి
-పోలీస్ ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని హోంమంత్రి వంగలపూడి అనిత పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో హోంమంత్రి అనిత అధ్యక్షతన శనివారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ అదృశ్య కేసులలో గాలింపు చర్యలపై వేగం పెంచి ఎటువంటి అఘాయిత్యం జరగముందే పట్టుకోవడంపై దృష్టి పెట్టాలన్నారు. ఇలాంటి కేసులలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ లు, కోర్టుల ద్వారా బాధితులకు త్వరగా న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఛార్జీషీట్లు వేయడం, నిందితుల అరెస్ట్ లలో జాప్యం లేకుండా చేసి నేరాలను నియంత్రించడంపై శ్రద్ధ వహించాలన్నారు. ఇకపై చిన్నారులు, మహిళలకు సంబంధించిన సున్నితమైన కేసులలో ప్రాధాన్యత క్రమంలో ఎప్పటికప్పుడు సమీక్ష చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇటీవల యాంటి నార్కొటిక్ టాస్క్ ఫోర్స్ బృందం అక్రమంగా రవాణా చేస్తున్న 25,251 కేజీల గంజాయిని పట్టుకోవడాన్ని ఈ సందర్భంగా హోంమంత్రి ప్రశంసించారు. ఈ కేసులో 373 వాహనాలను స్వాధీనపరచుకోవడం, 2,237 మంది నిందితులను గుర్తించడంలో కృషిని మెచ్చుకున్నారు. ఒడిషా సహా రాష్ట్ర సరిహద్దుల్లో జరుగుతున్న గంజాయి అక్రమ రవాణాని అదుపు చేయడం కోసం టాస్క్ ఫోర్స్ ని మరింత కట్టుదిట్టంగా తీర్చిదిద్దాలన్నారు. డ్రగ్స్ మూలాలున్న ప్రతి కేసుపట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. పదే పదే గంజాయి రవాణాకు పాల్పడే వారికి ఒక గట్టి హెచ్చరికలా చర్యలుండాలన్నారు.
సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టేవారిపై ఉక్కుపాదం మోపాలని హోంమంత్రి వంగలపూడి అనిత పోలీస్ ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేశారు. అసభ్య పదజాలం, మహిళలు చెప్పుకోవడానికి కూడా వీలుపడని అశ్లీల పోస్టులతో పేట్రేగిపోతున్నకొందరిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు ఆమె వెల్లడించారు. ఇంకా కొంతమందికి నోటీసులు ఇచ్చినట్లు హోంమంత్రి స్పష్టం చేశారు. ప్రత్యేక పోలీస్ చట్టాలను ప్రయోగించి ఇకపై సోషల్ మీడియాలో ఉన్మాదుల్లా వ్యవహరించే వారికి సందేశమిచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. సోషల్ మీడియా వేదికగా పేట్రేగిపోతున్న చీడపురుగుల్లా వ్యవహరించేవారికి బుద్ధిచెప్పేలా కూటమి ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావడం దిశగా చిత్తశుద్ధితో ముందుకెళుతోందన్నారు. డీజీపీ కార్యాలయం సహా ప్రతి జిల్లాలో సోషల్ మీడియా సెల్ లను ఏర్పాటు చేసి బాధితులకు అండగా ఉండేలా చర్యల దిశగా అడుగులు వేస్తామన్నారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, హోంమంత్రిని ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో న్యాయం చేయాలని కోరే బాధితుల సమస్యలకు ప్రాధాన్యతనిచ్చి వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పరిష్కరించాలన్నారు.
ప్రజల ఆశలకు అనుగుణంగా పని చేయడంలో పోలీసులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఎన్నో ఇబ్బందులు, కష్టాలతో న్యాయం చేస్తారని పోలీసుల దగ్గరకు వచ్చే బాధితులకు స్వాంతన కలిగే విధంగా ఎప్పటికప్పుడు చర్యలుండాలని ఆమె పేర్కొన్నారు. అన్ని జిల్లాలలో సీసీ కెమెరాలకు సంబంధించి డ్రైవ్ చేపట్టాలన్నారు. ప్రజల రక్షణే ధ్యేయంగా అన్ని ప్రాంతాలను సీసీ కెమెరాల పరిధిలోకి తేవడానికి చర్యలు చేపట్టాలన్నారు.
హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశాల ప్రకారం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నిబద్ధతతో వ్యవహరించనున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు. దర్యాప్తు జరుగుతున్న కేసులు సహా కీలక, సున్నితమైన కేసులలో వేగం, జవాబుదారీతనంతో ముందుకెళతామన్నారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, అదృశ్యమైన కేసుల ఛేదన దిశగా మరింత శ్రద్ధ పెడతామన్నారు. జిల్లాలలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం, ప్రజలను వాటి పరిధిలో నిఘా పెట్టి నేరాల నియంత్రణలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
హోంమంత్రి అనిత అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో డీజీపీ ద్వారకా తిరుమల రావు, ఇంటెలిజెన్స్ ఏడీజీ లడ్డా, సీఐడీ ఏడీజీ రవిశంకర్, యాంటి నార్కోటిక్ చీఫ్ ఆకే రవికృష్ణ,లా అండ్ ఆర్డర్ ఐజీ శ్రీకాంత్ సహా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు.